GIPMER: మలయాళంలో మాట్లాడితే కఠిన చర్యలు

ఆసుపత్రి పరిధిలో మలయాళం మాట్లాడితే కఠిన చర్యలు తప్పవంటూ దిల్లీకి చెందిన ఓ మెడికల్‌ వైద్యశాల తమ నర్సులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడికి వచ్చే రోగులకు, ఆసుపత్రిలో పనిచేసే....

Published : 06 Jun 2021 20:06 IST

నర్సులకు జిప్మర్‌ ఉత్తర్వులు.. అనంతరం వెనక్కి

దిల్లీ: ఆసుపత్రి పరిధిలో మలయాళం మాట్లాడితే కఠిన చర్యలు తప్పవంటూ దిల్లీకి చెందిన ఓ మెడికల్‌ వైద్యశాల తమ నర్సులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడికి వచ్చే రోగులకు, ఆసుపత్రిలో పనిచేసే ఇతర సిబ్బందికి ఆ భాష అర్థం కాదు కాబట్టి అది అసౌకర్యాన్ని కలిగిస్తుందని.. ఆసుపత్రి పరిధిలో ఉన్నప్పుడు ఆ భాష మాట్లాడొద్దని స్పష్టం చేసింది. అయితే వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడటంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది.

దేశంలోని అనేక ఆసుపత్రుల్లో కేరళకు చెందిన నర్సులు పనిచేస్తూ ఉంటారు. అయితే దిల్లీలోని ప్రముఖ గోవింద్ బల్లభ్ పంత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) శనివారం ఓ వివాదాస్పద సర్క్యులర్‌ జారీ చేసింది. ఇక్కడ పనిచేసే నర్సులు మలయాళంలో మాట్లాడొద్దని.. కేవలం హిందీ లేదా ఇంగ్లిష్ మాత్రమే మాట్లాడాలని పేర్కొంది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ ఉత్తర్వులపై పలు సంఘాలు మండిపడ్డాయి. జీబీ పంత్‌ నర్సుల సంఘం అధ్యక్షుడు లీలాధర్‌ రామచంద్రాని మాట్లాడుతూ.. యాజమాన్యానికి, నర్సులకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని.. ఓ రోగి చేసిన ఫిర్యాదు మేరకు జిప్మర్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా ఓ భాషను మాట్లాడొద్దని చెప్పడం సరికాదన్నారు. యాజమాన్యం ఉత్తర్వులను నర్సులు పాటించేందుకు సిద్ధంగా లేరని వెల్లడించారు.

ఈ ఘటనపై కాంగ్రెస్‌ స్పందించింది. మాతృభాషను మాట్లాడొద్దని చెప్పడం వారి హక్కులను కాలరాయడమేనని విమర్శించింది. ఓ భాషను మాట్లాడొద్దని చెప్పడం ఆ భాషపై వివక్ష చూపడమేనని కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మాతృభాషను మాట్లాడొద్దని చెప్పడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఎంతో ప్రమాదకరమని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ పేర్కొన్నారు. కాగా విమర్శలు వెల్లువెత్తడంతో జిప్మర్‌ ఆ ఉత్తర్వులను ఆదివారం వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని