ఆందోళనకరమే.. అయినా.. భయం వద్దు!

దేశ రాజధాని దిల్లీలో వైరస్‌ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అయినప్పటికీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు చాలా మార్గాలు ఉన్నాయని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Updated : 18 Apr 2021 15:44 IST

దిల్లీలో 30శాతానికి పెరిగిన కరోనా పాజిటివిటీ రేటు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతికి దేశ రాజధాని వణికిపోతోంది. గడిచిన 24గంటల్లోనే కరోనా పాజిటివిటీ రేటు 30శాతానికి పెరిగింది. దీంతో ఆసుప్రతులు కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉన్నట్లు దిల్లీ పభుత్వం పేర్కొంది. అయినప్పటికీ ఈ పరిస్థితిని అధిగమించేందుకు చాలా మార్గాలు ఉన్నాయని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

దిల్లీలో ఒక్కరోజే 25,500 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 30శాతానికి పెరగడం ఆందోళనకర విషయం. కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నగరంలో ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి ఎక్కువైంది. ఇప్పటికే దిల్లీ ఆసుపత్రుల్లో ఉన్న అత్యవరసర విభాగాలన్నీ (ఐసీయూ) కొవిడ్‌ రోగులతో నిండిపోతున్నాయి. ప్రస్తుతం కేవలం 100ఐసీయూ పడకలు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మరో 6వేల ఐసీయూ పడకలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇందుకు భారీ స్థాయిలో మెడికల్‌ ఆక్సిజన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇలాంటి కీలక సమయంలో పలు సదుపాయాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా కొవిడ్‌ ఆసుపత్రులను కూడా సిద్ధం చేస్తున్నామని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇందుకోసం క్రీడా మైదానాలను(కామన్వెల్త్ విలేజ్‌)ను కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

ఆక్సిజన్‌ కొరత తీవ్రం..

దిల్లీలో కరోనా తీవ్రత మరింత పెరగడంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ వినియోగం భారీగా పెరిగినట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు. దీంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని..ఈ నేపథ్యంలో మరింత మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం దిల్లీలో ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వైరస్‌ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు పలు మార్గాలున్నాయని.. వాటిన్నింటినీ ఉపయోగించుకుంటామని మీడియాకు వెల్లడించారు. కొవిడ్‌ నిర్ధారణ అయినవారు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రులకు పరుగెత్తకుండా.. ఇంటివద్దే చికిత్స తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దిల్లీలో కొవిడ్‌ పడకల సామర్థ్యాన్ని 6వేల నుంచి 17వేలకు పెంచామని మనీష్‌ సిసోడియా వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని