కాలుష్య రాజధానుల్లో తొలిస్థానంలో దిల్లీ!

ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో దేశ రాజధాని దిల్లీ మళ్లీ తొలిస్థానంలో నిలిచింది. లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్య పరిమాణం కాస్త తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ నివేదిక వెల్లడించింది.

Published : 16 Mar 2021 19:40 IST

ఐక్యూఎయిర్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య రాజధానుల్లో దేశ రాజధాని దిల్లీ మళ్లీ తొలిస్థానంలో నిలిచింది. లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్య పరిమాణం కాస్త తగ్గినప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ నివేదిక వెల్లడించింది. అత్యంత కాలుష్య రాజధానుల్లో దిల్లీ తొలిస్థానంలో నిలవడం వరుసగా మూడోసారి కావడం ఆందోళన కలిగించే విషయం.

లాక్‌డౌన్‌ వల్ల వాతావరణంలో పీఎం2.5స్థాయి 11శాతం తగ్గినప్పటికీ కాలుష్య దేశాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. తొలిస్థానంలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌లో కాలుష్య ప్రభావం ప్రమాదకరంగానే ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ నివేదిక అభిప్రాయపడింది. 2020 ఏడాదిలో ప్రపంచంలో అత్యంత కనిష్ఠ గాలి నాణ్యత ప్రాంతాల్లో దక్షిణాసియా ముందు నిలిచిందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం, గాలిలో పీఎం2.5 స్థాయి 10 మైక్రో గ్రాములు మించకూడదు. భారత ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములుగా ఉండొచ్చు. కానీ, డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాదకర స్థాయికంటే దిల్లీలో కాలుష్యతీవ్రత 14రెట్లు ఎక్కువగా నమోదవుతోంది. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో అక్కడ పీఎం2.5 స్థాయిలు 150కిపైనే ఉంటున్నాయి. వాతావరణ కాలుష్యం దిల్లీలో ఏటా దాదాపు 54వేల మరణాలకు కారణమవుతున్నట్లు గతేడాది విడుదలైన ఐక్యూఎయిర్‌, గ్రీన్‌పీస్‌ దక్షిణాసియా సంస్థల విశ్లేషణలో తేలింది.

వాతావరణ కాలుష్యంలో ఉండే ప్రమాదకరమైన పీఎం2.5 కణాలు శ్వాసకోస వ్యవస్థ, క్యాన్సర్‌, హృదయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న విషయం తెలిసిందే. వీటిని అంచనా వేసేందుకు స్విస్‌ గ్రూపునకు చెందిన ఐక్యూఎయిర్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అధ్యయనం చేపడుతుంది. ఇందులో భాగంగా ప్రమాదకరమైన పీఎం 2.5స్థాయిలు దిల్లీ నగరంలో 2020 సంవత్సరంలో సరాసరి ఘనపు మీటరకు 84.1 మైక్రోగ్రాములు ఉన్నట్లు గుర్తించింది. ఇది బీజింగ్‌లో(37.5) ఉన్నదానికంటే రెండింతలు ఎక్కువ. గతేడాది లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా దిల్లీ ప్రజలు కొంతకాలం స్వచ్ఛమైన గాలి పీల్చినప్పటికీ, శీతాకాలం వచ్చేసరికి కాలుష్య తీవ్రత మళ్లీ పెరిగినట్లు ఐక్యూఎయిర్‌ వెల్లడించింది. సాధారణ రోజుల్లో దిల్లీలో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని