Delhi Mayor: దిల్లీ మేయర్‌ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!

దిల్లీ మేయర్‌ ఎన్నికపై (Delhi Mayor) వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో భాజపా (BJP), ఆప్‌(AAP)ల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 6న మూడోసారి సమావేశమైనప్పటికీ ఇరు పార్టీల సభ్యుల నిరసనల మధ్య సభ వాయిదా పడింది.

Published : 06 Feb 2023 13:58 IST

దిల్లీ: దిల్లీ మేయర్‌ (Delhi Mayor) ఎన్నిక వ్యవహారంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు మూడోసారి ప్రయత్నించినప్పటికీ అదీ విఫలమయ్యింది. మేయర్‌ ఎన్నికలో నాటినేటెడ్‌ సభ్యులు (Aldermen) ఓటు వేసేందుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్యా శర్మ అనుమతి ఇవ్వడంపై ఆమ్‌ఆద్మీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే సభ మరోసారి వాయిదా పడింది. దీంతో ఆప్‌ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ భాజపా కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోగా.. ఆప్‌ కౌన్సిలర్లు మాత్రం అక్కడే కూర్చొని నిరసన తెలియజేశారు.

గత డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో (MCD Polls)  ఆప్‌ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. 134 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్‌ ఎన్నిక మెజారిటీ ప్రకారం ఆ పదవి ఆప్‌కే దక్కే అవకాశాలు ఉంటాయి. కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్‌ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆప్‌ ఆశ్రయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని