Delhi Water Crisis: దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?

నీటి సరఫరా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు దుండగులు ప్రయత్నిస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.

Updated : 16 Jun 2024 14:16 IST

దిల్లీ: దేశ రాజధాని నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. యమునాకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో దిల్లీ జల మంత్రిత్వశాఖ కీలక చర్యలకు ఉపక్రమించింది. నగరానికి వచ్చే ప్రధాన పైపులైన్లకు పహారా కాయాలని విజ్ఞప్తి చేస్తూ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసింది.

‘‘యమునా నదికి ప్రవాహం తగ్గింది. రోజుకు 70 మిలియన్‌ గ్యాలన్ల నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్ర ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రతి నీటిబొట్టూ విలువైంది. దాని పంపిణీ వ్యవస్థను రక్షించుకోవాలి’’ అని కమిషనర్‌కు రాసిన లేఖలో దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ల వద్ద దిల్లీ జల్‌ బోర్డు ఇప్పటికే గస్తీ బృందాలను ఏర్పాటు చేసిందన్నారు.

మిగులు జలాలపై మాట మార్చిన హిమాచల్‌

నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైపులైన్లలో అనేక చోట్ల బోల్టులను తొలగించడంతో లీకేజీలు ఏర్పడుతున్నట్లు గుర్తించామని మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. వీటి వెనక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నగరానికి వచ్చే నీటి పైపులను ట్యాంపరింగ్‌ చేయకుండా రక్షించేందుకు 15 రోజులపాటు గస్తీ నిర్వహించాలని పోలీస్‌ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని