Satyendar Jain: హవాలా కేసులో దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌

హవాలా కేసులో దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన..

Updated : 30 May 2022 20:43 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

కేజ్రీవాల్‌ అప్పుడే అన్నారు..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈ జనవరిలోనే ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అరెస్టు చేసే అవకాశాలపై వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ‘జైన్‌ను ఈడీ అరెస్టు చేయనున్నట్లు తెలిసింది. ఆయన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ రెండుసార్లు దాడులు చేయించినా.. ఏం దొరకలేదు. ఈడీ అధికారులు మళ్లీ రావాలనుకుంటే.. వారికి స్వాగతం’ అని అన్నారు. ఈ దాడులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నప్పుడల్లా భాజాపా.. ప్రభుత్వ ఏజెన్సీలను ప్రయోగిస్తుందంటూ అప్పట్లో విరుచుకుపడ్డారు.  అయితే, కేజ్రీవాల్‌ చెప్పినట్టుగా పంజాబ్‌ ఎన్నికల సమయంలో జైన్‌ను అరెస్టు చేయనప్పటికీ.. తాజా పరిణామంతో అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అందుకే సత్యేందర్‌ని అరెస్టు చేశారు: సిసోడియా

మనీలాండరింగ్‌ కేసులో తమ సహచర మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఈడీ అరెస్టు చేయడంపై దిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్‌ కీలక నేత మనీశ్‌ సిసోడియా స్పందించారు. ‘‘సత్యేందర్‌పై ఈ నకిలీ కేసు దాదాపు ఎనిమిదేళ్లుగా నడుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ ఆయన్ను పిలిచింది. ఆయనకు వ్యతిరేకంగా ఏమీ దొరకపోవడంతో కొంత కాలం పాటు ఈడీ ఏమీ అనలేదు. సత్యేందర్‌ జైన్‌ హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలకు ఆప్‌ ఇంఛార్జిగా ఉండటంతో ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టింది’’ అని ట్వీ్ట్‌ చేశారు. ‘‘హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం భాజపాకు పట్టుకుంది. ఆందుకే ఆయన ఆ రాష్ట్రానికి వెళ్లకుండా నిరోధించేందుకు అరెస్టు చేసింది. ఫేక్‌ కేసులో అరెస్టు చేసినందున సత్యేందర్‌ త్వరలోనే విడుదలవుతారు’’ అని సిసోడియా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని