Pollution: 2022లో అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల!

సీపీసీబీ నివేదిక ప్రకారం దిల్లీలో గత నాలుగేళ్లలో నగరంలో గాలి నాణ్యత ఏడు శాతం మేర పడిపోయినట్లు నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ సూచీలు చెబుతున్నాయి. మరోవైపు 2026కల్లా దేశంలోని కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించాలని కేంద్రం గతేడాది సెప్టెంబరులో లక్ష్యంగా పెట్టుకుంది. 

Published : 11 Jan 2023 00:35 IST

దిల్లీ:  గతేడాది దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) విడుదల చేసింది. ఈ జాబితాలో దేశ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో ఉంది. సీపీసీబీ నివేదిక ప్రకారం దిల్లీలో గాలిలో కాలుష్య కారకాల మోతాదు 2.5  పీఎమ్‌గా ఉంది. గత నాలుగేళ్లలో నగరంలో గాలి నాణ్యత ఏడు శాతం మేర పడిపోయినట్లు నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ) సూచీలు చెబుతున్నాయి. 2019లో క్యూబిక్‌ మీటర్‌కు108 మైక్రోగ్రామ్‌లుగా ఉండగా, 2022లో 99.71 మైక్రోగ్రామ్‌లకు పడిపోయింది. 2024 నాటికి దీన్ని 20 నుంచి 30 శాతం మేర తగ్గించాలని ఎన్‌సీఏపీ లక్ష్యంగా పెట్టుకొంది. 

దిల్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా హరియాణాలోని ఫరీదాబాద్‌ (95.64 మైక్రోగ్రామ్‌లు), ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ (91.25 మైక్రోగ్రామ్‌లు) ఉన్నట్లు సీపీసీబీ డేటా చెబుతోంది. 2024 కల్లా దేశంలోని కాలుష్యాన్ని 20 నుంచి 30 శాతం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2019లో ఎన్‌సీఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం దేశంలోని 102 నగరాలను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో131 నగరాలు ఉన్నాయి. మరోవైపు 2026కల్లా దేశంలోని కాలుష్యాన్ని 40 శాతం మేర తగ్గించాలని కేంద్రం గతేడాది సెప్టెంబరులో లక్ష్యంగా పెట్టుకుంది. 

సీపీసీబీ అంచనాల ప్రకారం 2.5 పీఎమ్‌ మోతాదు కంటే తక్కువ పరిమాణంలో ఉన్న కాలుష్య కారకాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ నుంచి ఇతర అవయవాలకు, రక్తంలోనూ కలిసి తీవ్ర అనారోగ్యానికి కారణమవుతాయి. సీపీసీబీ డేటా ప్రకారం 2019తో పోలిస్తే 2022లో గాలి నాణ్యత స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 2024కు మరో ఏడాది సమయం ఉండటం, 131 నగరాల్లో చాలా నగరాలు ఇప్పటికీ లక్ష్యానికి దూరంగా ఉండటం, కాలుష్యాన్ని తగ్గించేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికలు అమలు చేయకపోవడంపై వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని