Covid India: కొవిడ్‌ కేసుల్లో దిల్లీ రికార్డ్‌.. ఒక్కరోజే 28వేల కేసులు!

దేశ రాజధానిలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. నేడు ఒక్కరోజే 28,867 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.

Published : 13 Jan 2022 22:45 IST

నగరాల్లో భారీగా పెరుగుతోన్న పాజిటివిటీ రేటు

దిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దాదాపు రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా.. తాజాగా దేశ రాజధానిలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. నేడు ఒక్కరోజే దిల్లీలో రికార్డు స్థాయిలో 28,867 పాజిటివ్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. అంతేకాకుండా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 29శాతానికి పెరిగింది. కొవిడ్‌ పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. ఇక దిల్లీలో ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌ 20న అక్కడ అత్యధికంగా ఒక్కరోజే 28,395 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 

ముంబయిలోనూ కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి అక్కడ 13,702 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 21శాతంగా ఉన్నట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. ముందురోజుతో పోలిస్తే రోజువారీ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. బుధవారం నాడు ముంబయిలో 16వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. అయితే, జనవరి 7న అత్యధికంగా 20వేల కేసులు వెలుగుచూడగా.. గత నాలుగు రోజులుగా అంతకు దిగువనే కేసులు నమోదవుతున్నాయి.

అటు కర్ణాటకలోనూ కొవిడ్‌ ఉగ్రరూపం చూపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 25వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 12.3శాతంగా ఉంది. డిసెంబర్‌ చివరి వారం నుంచి అక్కడ కొవిడ్‌ ఉద్ధృతి మరింత పెరిగింది. నిన్న ఒక్కరోజు 21వేల కేసులు రికార్డు కాగా నేడు మరింత పెరిగింది. ఇప్పటివరకు కర్ణాటకలో 31లక్షల 24వేల పాజిటివ్‌ కేసులు వెలుగు చూడగా.. 38,397 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి.

కోల్‌కతాలోనూ కొవిడ్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నగరంలో నిన్న ఒక్కరోజే 7వేల కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 22వేల కేసులు రికార్డు కాగా పాజిటివిటీ రేటు 30శాతం దాటింది. అయితే, అంతకు ముందురోజు ఇది 32శాతంగా ఉంది. పశ్చిమబెంగాల్‌లో గత వారపు కొవిడ్‌ పాజిటివిటీ రేటు 60శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇలా దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆయన.. వైరస్‌ కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓవైపు వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా చేపడుతూనే వైరస్‌ కట్టడికి స్థానికంగా కంటైన్మెంట్‌ జోన్ల ఏర్పాటు, కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా పండగల వేళ ప్రజలు నిర్లక్ష్యం వహించవద్దని.. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని