Air India: మహిళపై మూత్రవిసర్జన ఘటన.. ఎట్టకేలకు నిందితుడి అరెస్టు

ఎయిరిండియా (Air India) విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడు అరెస్టయ్యాడు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతడిని బెంగళూరులో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 07 Jan 2023 10:40 IST

బెంగళూరు: ఎయిరిండియా (Air India) విమానంలో ఓ వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ మిశ్రాను దిల్లీ పోలీసులు (Delhi police) శనివారం ఉదయం బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో ఎయిరిండియా ఫిర్యాదు మేరకు అతడిపై దిల్లీలో కేసు నమోదైన విషయ తెలిసిందే.

గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. బాధిత మహిళ టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో విషయం బహిర్గతమైంది. ఈ ఘటన గురించి చెప్పినా ఎయిరిండియా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. దీంతో ఎయిరిండియాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిందితుడిపై ఎయిర్‌లైన్‌ 30 రోజుల నిషేధం విధించింది. మరోవైపు, ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి శంకర్‌ ఆచూకీ కన్పించకుండా పోయింది. ముంబయిలోని ఆయన నివాసానికి తాళం వేసి ఉంది. దీంతో దిల్లీ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే అతడు బెంగళూరు (Bengaluru)లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ స్విచాఫ్‌ చేసినప్పటికీ.. సోషల్‌మీడియా, క్రెడిట్ కార్డులను వినియోగించారని, దానివల్లే ఆచూకీ గుర్తించగలిగామని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్‌ మిశ్రా ఈ వివాదంపై స్పందించారు. బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించానని, వివాదం అక్కడితో సమసిపోయిందని తెలిపారు. అయితే నష్టపరిహారం చెల్లించిన నెల రోజుల తర్వాత బాధితురాలి కుమార్తె ఆ డబ్బును తిరిగి పంపించేశారని వివరించారు. ఈ మేరకు మిశ్రా తరపు న్యాయవాదులు ఓ ప్రకటనను విడుదల చేశారు. బాధితురాలి పాడైపోయిన బ్యాగ్‌, దుస్తులను మిశ్రాకు పంపారని, ఆయన వాటిని ఉతికించి నవంబరు 30నే ఆవిడకు అందజేశారన్నారు. అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్‌ ఫార్గో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్‌ మిశ్రాను.. ఘటన నేపథ్యంలో సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని