దిల్లీ ఘటన: రైతు నేతలపై లుకౌట్‌ నోటీసులు

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో జరిగిన అల్లర్లపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌, యోగేంద్ర యాదవ్‌, దర్శన్‌ పాల్‌, గుర్నాం సింగ్‌

Updated : 28 Jan 2021 17:19 IST

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో జరిగిన అల్లర్లపై దిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌, యోగేంద్ర యాదవ్‌, దర్శన్‌ పాల్‌, గుర్నాం సింగ్‌ చాదుతో సహా పలువురు రైతు సంఘాల నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకాగా.. నేడు తాజాగా లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అంతేగాక, విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా వారి నుంచి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం. 

జనవరి 26 నాటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర హోంశాఖ.. అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడం.. పోలీసులపై దాడి చేసి గాయపర్చిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు దర్యాప్తును వేగవంతం చేసిన దిల్లీ పోలీసు యంత్రాంగం నేడు రైతు సంఘాల నాయకులపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. 

పోలీసులను పరామర్శించనున్న అమిత్‌షా

దిల్లీ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి సీనియర్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలోనే పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అల్లర్లలో గాయపడిన పోలీసులను షా నేడు పరామర్శించనున్నారు. రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసి వారితో మాట్లాడనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో దిల్లీలోని శుహ్రత్‌, సివిల్‌ లైన్స్‌ ఆసుపత్రుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. హాస్పిటల్స్‌ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి.. భారీగా పోలీసులు మోహరించారు. 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. 

సరిహద్దుల్లో భద్రత పెంపు

మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దుల్లో భద్రతను పెంచారు. ఎర్రకోట వద్ద కూడా భారీగా బలగాలను మోహరించారు. ఈ నెల 31 వరకు ఎర్రకోటను మూసివేశారు. 

ఇవీ చదవండి..

దిల్లీ ఘటన: దీప్‌ సిద్ధూ ఎక్కడ?

కేంద్రం కన్నెర్ర


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని