Shashi Tharoor: వీడని సునందా పుష్కర్‌ కేసు.. శశిథరూర్‌కు నోటీసులు

సునందా పుష్కర్‌ హత్య కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కు క్లీన్‌ చిట్ ఇస్తూ దిల్లీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పోలీసులు సవాల్‌ చేశారు. 

Updated : 01 Dec 2022 13:37 IST

దిల్లీ: తన భార్య సునందా పుష్కర్‌ మృతి కేసు నుంచి కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు ఊరట కల్పించడంపై దిల్లీ పోలీసులు హైకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది పాటియాలా హౌస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ పోలీసులు సవాల్‌ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన దిల్లీ హైకోర్టు.. కాంగ్రెస్‌ ఎంపీ థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసులో శశిథరూర్‌కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత దిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్‌ ఆలస్యానికి క్షమించాలని దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని అప్పీల్‌ చేసుకున్నారు. ఈ అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం.. శశిథరూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ పిటిషన్‌ కాపీని తమకు పంపలేదని థరూర్‌ కౌన్సిల్‌ కోర్టుకు తెలియజేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు మెయిల్‌ ఐడీకి పిటిషన్‌ కాపీ పంపించారని పేర్కొంది. దీంతో కాపీని వెంటనే థరూర్‌కు పంపించాలని న్యాయమూర్తి జస్టిస్‌ డీకే శర్మ.. దిల్లీ పోలీసులను ఆదేశించారు. అంతేగాక, కేసుకు సంబంధించిన పత్రాలను వ్యాజ్యదారులకు మినహా వేరే వ్యక్తులకు పంపించొద్దని గట్టిగా సూచించారు. ఈ కేసు విచారణను 2023, ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేశారు.

2014, జనవరి 17న దిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో సునందా పుష్కర్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తొలుత ఇది హత్య అన్న కోణంలో విస్తృతంగా దర్యాప్తు జరిగింది. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. అయితే, సునంద ఆత్మహత్య చేసుకునేలా థరూర్‌ ప్రేరేపించారన్నవి ఆయనపై అభియోగాలు. ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. దీంతో ఆయన దిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన పాటియాలా హౌస్‌ కోర్టు.. 2021 ఆగస్టులో శశిథరూర్‌పై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని