NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్‌’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు

ప్రముఖ ఆన్‌లైన్‌ మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌ (NewsClick) ఆఫీసులు, ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లల్లో దిల్లీ పోలీసులు సోదాలు చేపట్టారు. చైనా నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Updated : 03 Oct 2023 10:06 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ (NewsClick)కు చైనా (China) నుంచి నిధులు (Funds) అందుతున్నాయంటూ ఇటీవల వచ్చిన ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా  ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు (Delhi Police).. న్యూస్‌క్లిక్‌ ఆఫీసు, ఆ మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు (Raids) చేపట్టారు.

మంగళవారం ఉదయం దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ విభాగం అధికారులు.. స్థానిక న్యూస్‌క్లిక్‌ (NewsClick) కార్యాలయంతో పాటు పలువురు సీనియర్‌ జర్నలిస్టుల ఇళ్లల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. దాదాపు 30 ప్రదేశాల్లో చేపట్టిన ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలపై ఓ సీనియర్‌ జర్నలిస్టు సోషల్‌మీడియాలో స్పందిస్తూ.. ‘‘నా ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను పోలీసులు తీసుకెళ్లారు’’ అని వెల్లడించారు.

హత్యచేసి.. బతికుందని నమ్మించాడు: దిల్లీలో ఓ పోలీసు దురాగతం

న్యూస్‌ క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో ‘న్యూయార్క్‌ టైమ్స్’ వంటి అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించాయి. అమెరికా మిలియనీర్‌ నెవిల్లే రాయ్‌ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్‌.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనాలని పేర్కొన్నాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ క్రమంలోనే ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దీనిపై కేసు నమోదు చేసి.. ‘న్యూస్‌క్లిక్‌’ ఆఫీసులో సోదాలు నిర్వహించింది. ఈ పోర్టల్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను కూడా అటాచ్‌ చేసింది.

ఈ దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారంతో ఆగస్టులో దిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద న్యూస్‌క్లిక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా సోదాలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. న్యూస్‌క్లిక్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా 2021లో సోదాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని