లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు

లండన్‌లోని భారత హైకమిషన్(Indian High Commission in London) వద్ద జరిగిన ఘటనపై దిల్లీ పోలీసు కేసు నమోదు చేశారు. ఖలిస్థానీ సానుభూతిపరులు దీనికి పాల్పడ్డారు. 

Published : 24 Mar 2023 14:20 IST

దిల్లీ: ఖలిస్థానీ అనుకూల వాదులు లండన్‌(London)లోని భారత్‌ హైకమిషన్‌ భవనం(Indian High Commission in London)పై ఎగురవేసిన జాతీయ జెండాను కిందికి దింపి దుశ్చర్యకు తెగబడిన ఘటన తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై శుక్రవారం దిల్లీ పోలీసులు(Delhi Police ) కేసు నమోదు చేశారు. హై కమిషన్‌ వద్ద జరిగిన ఘటనపై విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి నివేదిక అందిన నేపథ్యంలో దానిపై చర్యలు తీసుకోవాలని హోం శాఖ దిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే వారు కేసు నమోదు చేశారు. 

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh) అరెస్టుకు భారత్‌లో ముమ్మర యత్నాలు సాగుతున్న సమయంలో.. పలుదేశాల్లో ఖలిస్థాన్‌ అనుకూలురు భారత వ్యతిరేక చర్యలకు పూనుకున్నారు. ఆదివారం బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద గల త్రివర్ణ పతాకాన్ని దించేయగా, అమెరికాలో శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఏకంగా దాడికే దిగారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో పార్లమెంటు ముందూ పెద్దఎత్తున నిరసన నిర్వహించారు. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద దుశ్చర్య నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. విధ్వంసానికి దిగిన వారిలో ఓ అనుమానిత వ్యక్తిని స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు