Brij Bhushan: మహిళా రెజ్లర్‌తో.. బ్రిజ్‌భూషణ్‌ ఆఫీస్‌ వద్ద సీన్‌ రీక్రియేషన్‌..!

బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన ఓ మహిళా రెజ్లర్‌తో దిల్లీ పోలీసులు సీన్‌ రీక్రియేషన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Updated : 09 Jun 2023 20:02 IST

దిల్లీ: భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh) తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన కార్యాలయానికి ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ రీక్రియేట్‌ (recreation) చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ కథనం వెల్లడించింది.

‘‘శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో దిల్లీలోని బ్రిజ్‌ భూషణ్‌ ఆఫీస్‌కు పోలీసులు (Delhi Police) మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లారు. ఆమె వెంట మహిళా కానిస్టేబుల్స్‌ కూడా ఉన్నారు. దాదాపు అరగంట పాటు పోలీసులు అక్కడ ఉన్నారు. ఆ నివాసంలో ఎక్కడెక్కడ వేధింపులకు గురైందో గుర్తుకు తెచ్చుకుని ఆ సీన్‌ను రీక్రియేట్‌ చేయాలని పోలీసులు ఆమెను అడిగారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతోంది. ఇప్పటివరకు 180కి పైగా మందిని విచారించారు. దర్యాప్తు పూర్తి చేసి వచ్చే వారం లోగా కోర్టుకు నివేదిక సమర్పిస్తామని ఇటీవల సిట్‌ అధికారులు వెల్లడించారు.

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష (Wrestlers Protest) చేపట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని