BJP Leader Arrest: తజిందర్‌ అరెస్టుపై ‘పోలీస్‌ వార్’‌.. చివరకు దిల్లీ పోలీసులకు అప్పగింత

భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా అరెస్టు అటు పోలీసు వార్‌తో పాటు ఇటు రాజకీయ దుమారానికి దారితీసింది.

Published : 06 May 2022 17:10 IST

దిల్లీ: భాజపా యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా అరెస్టు అటు పోలీసు వార్‌తో పాటు ఇటు రాజకీయ దుమారానికి దారితీసింది. అనేక నాటకీయ పరిణామాల అనంతరం తజిందర్‌ను పంజాబ్‌ పోలీసుల నుంచి దిల్లీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై బెదిరింపులకు పాల్పడిన కేసులో తజిందర్‌ సింగ్‌పై పంజాబ్‌లోని మొహాలీలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు హాజరవ్వాలంటూ పంజాబ్‌ పోలీసులు గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయితే వాటికి స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం దిల్లీలోని ఆయన స్వగృహంలో పంజాబ్‌ పోలీసులు తజిందర్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ కుమారుడిని ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ తజిందర్‌ తండ్రి దిల్లీ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దిల్లీ పోలీసులు.. పంజాబ్‌ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

మరోవైపు తజిందర్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు పంజాబ్‌ పోలీసులు మొహాలీకి తరలిస్తుండగా.. మధ్యలో హరియాణా పోలీసులు రంగంలో దిగారు. కురుక్షేత్ర వద్ద పంజాబ్ పోలీసులను అడ్డుకున్నారు. అనంతరం దిల్లీ పోలీసులు కురుక్షేత్రకు వెళ్లి తజిందర్‌ను తమ కస్టడీలోకి తీసుకుని తిరిగి దిల్లీకి తరలించారు.

హైకోర్టుకు పంజాబ్‌ ప్రభుత్వం..

ఇదిలా ఉండగా..  హరియాణా పోలీసుల చర్యను పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కురుక్షేత్రలో పంజాబ్‌ పోలీసులను అడ్డగించడం, తజిందర్‌ను దిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం తదితర పరిణామాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం ఎదుట ఇటీవల భాజపా యువ విభాగం నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తజిందర్‌ పాల్‌ సింగ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై పంజాబ్‌లోని మొహాలీకి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్‌ పోలీసులు నేడు తజిందర్‌ను అరెస్టు చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని