‘నా దుస్తులు చించేశారు’.. దిల్లీ పోలీసులపై మహిళా ఎంపీ ఆగ్రహం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై దిల్లీ పోలీసుల దాడులు చేయడం పెను దుమారానికి దారితీసింది. తాజాగా కాంగ్రెస్‌ మహిళా ఎంపీ ఒకరు

Published : 16 Jun 2022 10:41 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై దిల్లీ పోలీసుల దాడులు చేయడం పెను దుమారానికి దారితీసింది. తాజాగా కాంగ్రెస్‌ మహిళా ఎంపీ ఒకరు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై దాడి చేసి, తన దుస్తులను చించారని ఆమె మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

ఆందోళన చేస్తోన్న తమ పట్ల పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని తమిళనాడులోని కరూర్‌ ఎంపీ జ్యోతిమణి ఆరోపించారు. ‘‘దిల్లీ పోలీసులు మాపై దారుణంగా దాడి చేశారు. నా బూట్లను లాగేసి..  నా దుస్తులను చించేశారు. నేరస్థుల వలే మమ్మల్ని బస్సుల్లోకి ఎక్కించి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదు. నీళ్లు కొనుక్కునేందుకు వెళ్తే దుకాణాల వారిని బెదిరించి.. మాకు నీరు లేకుండా చేశారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా. దీనిపై లోక్‌సభ స్పీకర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’ అని ఆమె వీడియోలో మాట్లాడారు.

ఈ వీడియోను శశిథరూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ కేంద్రంపై మండిపడ్డారు. ‘‘ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇది అత్యంత దారుణమైన ఘటన. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం.. ప్రతి భారతీయుడి మర్యాదకు భంగం కలిగించినట్లే. ఇప్పుడు ఒక లోక్‌సభ ఎంపీకి ఇలా జరగడం మరింత ఘోరం. దిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నా. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు. స్పీకర్‌ జీ.. దయచేసి దీనిపై చర్యలు తీసుకోండి’’ అని థరూర్‌ డిమాండ్‌ చేశారు.

రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌ నిరసనల సందర్భంగా దిల్లీలో బుధవారం కూడా తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయి.  కొంతమంది పోలీసులు బలవంతంగా తమ కార్యాలయంలోకి ప్రవేశించారని.. లాఠీఛార్జి చేసి పార్టీ నేతలు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్‌ ఆరోపించింది. మహిళా కార్యకర్తలతోనూ దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడింది. అక్రమంగా లోపలికి చొచ్చుకొచ్చిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేసింది. అయితే, ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.  ‘‘నిషేధాజ్ఞల నేపథ్యంలో నిరసన ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలనుకున్నాం. ఏఐసీసీ కార్యాలయం గేటు మూసేసేందుకు మేం ప్రయత్నించాం. ఆ ప్రక్రియలో కొంత ఘర్షణ చోటుచేసుకున్న మాట వాస్తవం. అంతేగానీ, ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు మేం ప్రయత్నించలేదు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని