‘జూమ్‌’ వేదికగా టూల్‌కిట్‌ పన్నాగం!

వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్‌కిట్‌ వివాదంపై దిల్లీ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు.

Published : 16 Feb 2021 14:35 IST

ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలో దర్యాప్తు

జూమ్‌కు పోలీసుల లేఖ

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్‌కిట్‌ వివాదంపై దిల్లీ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దీని వెనుక ఎవరున్నారు అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇందులోభాగంగా, గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనలకు ముందు(జనవరి 11న) నిర్వహించిన సమావేశ వివరాలు అందించాలని ‘జూమ్‌’ వీడియో కాన్ఫరెన్సింగ్‌ మాధ్యమానికి దిల్లీ పోలీసులు లేఖ రాశారు.

జూమ్‌ మీటింగ్‌లో 70మంది..

వ్యవసాయ చట్టాల విషయంలో భారత ప్రతిష్ఠను మసకబార్చే లక్ష్యంతో రూపొందించిన ఈ టూల్‌కిట్‌కు సంబంధించి ఇప్పటికే గూగుల్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమ సంస్థల నుంచి వివరాలను సేకరించారు. ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ఏర్పాటు చేసినట్లు భావిస్తోన్న ఈ జూమ్‌ సమావేశంలో దాదాపు 70మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తోన్న ముంబయికి చెందిన న్యాయవాది నికిత జాకబ్‌, పుణెకు చెందిన ఇంజినీర్‌ శంతనులు హాజరైనట్లు దిల్లీ పోలీసులు ఇప్పటికే స్పష్టంచేశారు. వీరితోపాటు ఎవరెవరు పాల్గొన్నారనే విషయంపై జూమ్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అయితే, ఈ టూల్‌కిట్‌(గూగుల్‌ డాక్యుమెంట్‌) కోసం వినియోగించిన ఈ మెయిల్‌ శంతునుదేనని పోలీసులు పేర్కొన్నారు.

ఖలిస్థాన్‌ అనుకూల సంస్థతో..

ఖలిస్థాన్‌ మద్దతు సంస్థ ‘పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌(పీజేఎఫ్‌)’ వ్యవస్థాపకుడు మొధాలీవాల్‌ తొలుత నికిత జాకబ్‌, శంతనులను సంప్రదించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి కెనడాకు చెందిన పునిత్‌ అనే మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 11న పీజేఎఫ్‌ ఏర్పాటు చేసిన ఈ జూమ్‌ సమావేశంలోనే ఈ డాక్యుమెంట్‌ ఎలా రూపొందించాలో నిర్ణయించడమే కాకుండా, ఈ టూల్‌కిట్‌కి ‘గ్లోబల్‌ ఫార్మర్‌ స్ట్రైక్‌’, ‘గ్లోబల్‌ డే ఆఫ్‌ యాక్షన్‌, 26 జనవరి’ అని పేరు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

దిశ అరెస్టు చట్టప్రకారమే..
దిశరవిని చట్ట ప్రకారమే అదుపులోకి తీసుకున్నామని దిల్లీ పోలీస్‌ కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ‘దిశ అరెస్టు విషయానికి వస్తే..మేం అన్ని నిబంధనలు పాటించాం. 22 ఏళ్లు, 50 ఏళ్లు అనే వయసు తేడాలు చట్టానికి ఉండవు. అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదనేది అవాస్తవం’  అని ఆయన వెల్లడించారు. 

రైతుల నిరసనల్లో భాగంగా జనవరి 26న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజున నిరసనకారులు చారిత్రక ఎర్రకోట వద్ద మతపరమైన జెండా ఎగరవేశారు. అప్పటి ఘటనల నేపథ్యంలో రైతులకు అంతర్జాతీయంగా ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ఈ క్రమంలో పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ టూల్ కిట్‌ను షేర్ చేశారు. ఇప్పుడదే వివాదానికి మూలబిందువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని