Updated : 18 Nov 2021 15:24 IST

 Delhi: ఈ నగరానికి ఏమైంది? దిల్లీని వణికిస్తున్న కాలుష్య భూతం!

అస్త్రశస్త్రాలన్నీ వాడుతున్నారు... బాబ్బాబు.. మీరూ సహకరించండి అని జనాన్ని వేడుకుంటున్నారు... అయినా కాలుష్య భూతం అదుపులోకి రావడం లేదు... దిల్లీకి పట్టిన పీడ విరగడవడం లేదు... ఇదికాక ‘మీతో కాకపోతే నగరంలో తాత్కాలికంగా లాక్‌డౌన్‌ అయినా విధించండి’ అంటూ అత్యున్నత న్యాయస్థానం తాజా హుంకరింపు! దీంతో ఆప్‌ ప్రభుత్వానికి ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది... ఇంతకీ స్వచ్ఛ రాజధాని కోసం సర్కారు ఏం చేసింది? ఏం చేయబోతోంది? అంటే...

* 2016 శీతకాలంలో కాలుష్యం, పొగమంచు కమ్మేసినప్పుడు నిరవధికంగా విద్యాసంస్థలను మూసేశారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులిచ్చారు. స్కూల్‌ బస్‌లు, క్యాబ్‌లు ఆగిపోవడంతో కాలుష్యం తగ్గుతుందనే ఉద్దేశంతో.

* ఆ సమయంలోనే పాత నిర్మాణాలు కూల్చివేయడంపై నిషేధం విధించారు. అలా చేస్తే దుమ్ము, ధూళి వాతావరణంలోకి వెలువడటం తగ్గుతుందనే ఈ నిర్ణయం.

* ఆసుపత్రులు, అత్యవసరాలకు తప్ప డీజిల్‌ జనరేటర్లు వాడొద్దనే నిబంధన తీసుకొచ్చారు.

* 2017 నవంబరులోనే దిల్లీ నగరంలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం.

* తీవ్రమైన కాలుష్యం వెదజల్లుతుందనే ఉద్దేశంతో నగర సమీపంలోని బదార్‌పూర్‌ పవర్‌ప్లాంట్‌ని శాశ్వతంగా మూసివేశారు.

* ఐదేళ్ల నుంచే దేశ రాజధాని ప్రాంతంలో తక్కువ కాలుష్యం వెలువరించే బీఎస్‌-6 కార్లను మాత్రమే వాడకానికి అనుమతిస్తున్నారు.

* అక్రమంగా నిర్మితమై, విద్యుత్తు కోసం డీజిల్‌ జనరేటర్లు ఉపయోగిస్తున్న కాలనీలకు ప్రభుత్వమే విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు.

* చెట్ల ఆకులు, వ్యర్థాలు కాలుస్తూ పొగ వెలువడటానికి కారణమవుతున్న సంఘటనలను అరికట్టేలా దిల్లీ పర్యావరణ శాఖ ఓ యాప్‌ రూపొందించింది.

* ‘ఫేమ్‌’ పథకం కింద బ్యాటరీ వాహనాలు కొన్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం సైతం భారీ రాయితీలిస్తోంది.

* పదిహేనేళ్ల పరిమితి దాటిన వాహనాలు దిల్లీ రోడ్లపై తిరగడానికి వీల్లేదనే నిబంధన తీసుకొచ్చారు.

* నగర వాతావరణం, గాలిని శుద్ధి చేసేలా దిల్లీ నగరం అంతటా ‘స్మాగ్‌ టవర్లు’ ఏర్పాటు చేశారు.

* ప్రతిష్ఠాత్మక దిల్లీ మెట్రో ప్రస్తుతం 80 శాతానికిపైగా సౌరవిద్యుత్తుతో పని చేస్తోంది. దీనికోసం ‘రేవా మెగా సోలార్‌ ప్రాజెక్ట్‌’తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లలో వందశాతం సోలార్‌ విద్యుత్తునే ఉపయోగించేలా ప్రణాళికలు రచించారు.

* అక్టోబర్‌ 2020లో ‘గ్రీన్‌ దిల్లీ’ మొబైల్‌ యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా కాలుష్యకారక విషయాలపై వచ్చిన ఫిర్యాదులు పరిష్కరించడానికి పదిమంది సభ్యులతో కూడిన పొల్యూషన్‌ కంట్రోల్‌ టీం ఏర్పాటు చేశారు.

* ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలుష్యం తగ్గించడానికి సరి, బేసి అంకెల వాహన వాడక విధానం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం సరి అంకెలు ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి అంకెలున్న వాహనాలు మరోరోజు మాత్రమే రోడ్లపైకి రావాలనే నిబంధన పెట్టారు.

ఏం చేయబోతున్నారు?

* కాలుష్య స్థాయిలు ‘ఎమర్జెన్సీ’ స్థాయికి చేరడంతో వచ్చే సోమవారం వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆజ్ఞలిచ్చారు.

* నవంబరు 17 దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. ట్రాఫిక్‌ని తగ్గించేందుకు ప్రైవేటు సంస్థలు సైతం ఈ విధానం పాటించాలని సూచించారు.

* భవన నిర్మాణ కూల్చివేతలపై నిషేధం కొనసాగుతోంది.

* కాలుష్యాన్ని తగ్గించే ‘యాంటీ స్మాగ్‌ గన్స్‌’ని పదిచోట్ల ఏర్పాటు చేయబోతున్నారు.

* ‘రెడ్‌లైట్‌ ఆన్‌, గాడీ ఆఫ్‌’ ప్రచారం ఉధృతం చేశారు. ఎర్ర లైట్‌ పడితే ఇంజిన్‌ ఆఫ్‌ చేయడం లక్ష్యం.

* ఉత్తరాదిలో పంట కోసిన తర్వాత మిగిలిన కొయ్యలను కాల్చడం అలవాటు. ఇది పెద్దఎత్తున కాలుష్యానికి కారణమవుతోంది. దీనికి విరుగుడుగా ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ శాస్త్రవేత్తలతో కలిసి ఈ కొయ్యలను కుళ్లబెట్టి, ఎరువుగా మార్చేలా ‘పూసా కంపోజర్‌’ ఎరువును తయారు చేశారు. రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్