Delhi: దిల్లీలో చలిపులి.. 15 వరకు పాఠశాలలు బంద్‌

దిల్లీలోని పాఠశాలలను జనవరి 15 వరకు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ  నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Published : 08 Jan 2023 21:16 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) లో చలిపులి గాండ్రిస్తోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు (Temparature)పడిపోతున్నాయి. ప్రజలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదివారం కనిష్ఠంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 15 వరకు స్కూళ్లను మూసివేయాలని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చింది. నిజానికి దిల్లీలోని ప్రభుత్వపాఠశాలల్లో జనవరి 1 నుంచి 15వతేదీ వరకు శీతాకాలపు సెలవులు ఇస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు మాత్రం వారం రోజుల ముందుగానే జనవరి 9 నుంచి పాఠశాలలను పునఃప్రారంభిస్తాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో దిల్లీ విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ చలి తీవ్రత రానున్న రెండు రోజుల పాటు మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.హిమాలయ వాయువ్య ప్రాంతం మీదుగా వీస్తున్న చలిగాలుల వల్ల దిల్లీతోపాటు హరియాణా, పంజాబ్‌,ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన హిమాచల్‌ ప్రదేశ్‌,మిజోరాం,త్రిపుర తదితర రాష్ట్రాల్లోనూ చలి తీవ్రంగా ఉంటోంది. పొగమంచు కారణంగా జనజీవనం స్తంభించిపోతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగినా.. ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పుంజుకునే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని