
Dengue: దిల్లీలో డెంగీ పంజా.. ఆరేళ్లలోనే అత్యధిక కేసులు
దిల్లీ: ఒకవైపు తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోన్న దిల్లీ వాసులకు మరోవైపు పెరుగుతున్న డెంగీ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి! దేశ రాజధాని పరిధిలో తాజాగా ఆరేళ్లలో ఎన్నడూ లేనన్ని కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ సీజన్‌లో దిల్లీలో డెంగీ కేసుల సంఖ్య 5,270 దాటింది. 2015 నుంచి ఒక ఏడాదిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే. 2020లో 1,072 మాత్రమే నమోదు కాగా.. ఈసారి ఏకంగా అయిదు వేలు దాటింది. ఇందులో గత వారం వ్యవధిలోనే దాదాపు 2,570 కేసులు వెలుగుచూడటం గమనార్హం. అయితే.. కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.
కొవిడ్ పడకల్లో డెంగీ రోగులకు చికిత్స..
గతంలో 2015లో భారీ ఎత్తున డెంగీ కేసులతో దిల్లీ అతలాకుతలమైంది. అప్పుడు కేసుల సంఖ్య అక్టోబర్‌లోనే 10,600 దాటింది. 1996 తర్వాత అత్యధిక కేసులు నమోదైన ఏడాదిగా మిగిలింది. తాజాగా ఈ సంవత్సరం కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు అధికారికంగా తొమ్మిది మంది మృతి చెందారు. 2017 తర్వాత ఒక ఏడాదిలో డెంగీ మరణాల సంఖ్య కూడా ఇదే అత్యధికం. మరోవైపు ఆప్ ప్రభుత్వం స్థానికంగా విషజ్వరాల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు డెంగీ రోగుల కోసం కేటాయించాలని కేజ్రీవాల్ సర్కారు కొద్దిరోజుల క్రితమే నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న అన్ని ఆసుపత్రుల్లో డెంగీ రోగుల కోసం తగినన్ని ఏర్పాట్లు చేశామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు.