Delhi: రెండు నెలల కనిష్ఠానికి పాజిటివిటీ రేటు

వరుసగా నాలుగో రోజూ 2వేలు కన్నా తక్కువ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం.

Published : 26 May 2021 16:16 IST

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ ఆంక్షలతో దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ 2వేలు కన్నా తక్కువ కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో 1,491మంది కరోనా బారిన పడగా, 3,952మంది కోలుకున్నారు. కరోనాతో పోరాడుతూ 130మంది మృతి చెందారు. దిల్లీలో పాజిటివిటీ రెండు నెలల కనిష్ఠానికి పడిపోయి, 1.93శాతంగా నమోదైంది.

మరోవైపు దేశ రాజధానిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేజ్రీవాల్‌ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను దిల్లీకి సరఫరా చేసేందుకు తయారీదారులు అంగీకారం తెలిపారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. అయితే, ఎంత మొత్తంలో వ్యాక్సిన్‌ రాష్ట్రానికి సరఫరా చేస్తారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం దిల్లీలో 620 మంది బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్నారని, అయితే, వారికి చికిత్స అందించే స్థాయిలో ఆంఫోటైరిసిన్‌-బి ఔషధం అందుబాటులో లేదని కేజ్రీవాల్‌ తెలిపారు.

‘స్పుత్నిక్‌-వి తయారీదారులతో ఇప్పటికే చర్చలు జరిపాం. వారు వ్యాక్సిన్‌ సప్లయ్‌ చేస్తామని తెలిపారు. అయితే, ఎంత మొత్తంలో అనేది ఇంకా స్పష్టత రాలేదు.  మంగళవారం కూడా మరోసారి తయారీదారులతో మా అధికారుల బృందం చర్చలు జరిపింది. అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి, తమ రాష్ట్ర ప్రజలకు అందించవచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకూ ఏ రాష్ట్రమూ ఒక్క వ్యాక్సిన్‌ డోస్‌ను కూడా అలా ఇవ్వలేదు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లు ఆహ్వానిస్తున్నాయి. కానీ, ఒక్క తయారీ సంస్థ కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ ఆవశ్యకతను కేంద్రం ప్రభుత్వం గుర్తించాలి. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలి’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

ప్రస్తుతం అందరం కరోనాపై యుద్ధం చేస్తున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీలో లాక్‌డౌన్‌ ఎత్తివేసే విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నిరవధికంగా లాక్‌డౌన్‌ ఎప్పటికీ విధించం. దాని వల్ల ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతింటాయి. అయితే, ఎలా తిరిగి కార్యచరణ మొదలు పెట్టాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని కేజ్రీవాల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని