
Delhi: దిల్లీలో కొవిడ్ వ్యాప్తి తగ్గుతోంది.. వాటి ఫలితంగానే
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో రెండు రోజులుగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. వారాంతపు కర్ఫ్యూ, ముందస్తు ఆంక్షలు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో దోహదపడ్డాయని తెలిపారు. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితులను పర్యవేక్షిస్తామని, ఆపై ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు, దిల్లీలో ఆదివారం 18,286 కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్నటితో (20,718 కేసులు) పోలిస్తే 13శాతం తక్కువగా నమోదయ్యాయి. దిల్లీలో తాజాగా కొవిడ్ కాటుకు 28మంది బలైపోయారు. ప్రస్తుతం దేశ రాజధాని నగరంలో యాక్టివ్ కేసుల సంఖ్య 89,819కి చేరింది. దిల్లీలో పాజిటివిటీ రేటు 27.87కి తగ్గింది.
తక్కువ సంఖ్యలో పరీక్షల నిర్వహణ కారణంగా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గడం లేదని మంత్రి సత్యేందర్ జైన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఐసీఎంఆర్ సిఫార్సు చేసిన పరీక్షల కంటే దిల్లీలో మూడు రెట్లు ఎక్కువే టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. గత నెల రోజుల వ్యవధిలో రోజుకు 60 వేల నుంచి లక్ష వరకు పరీక్షలు చేపట్టినట్లు తెలిపారు. నగర ఆసుపత్రుల్లోనూ కొవిడ్ రోగుల సంఖ్య తగ్గుతోందన్నారు. దిల్లీలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు భావిస్తున్నామని, ఇక నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని జైన్ శనివారం చెప్పిన విషయం తెలిసిందే. రోజువారీ కేసులు 15 వేలకు చేరినప్పుడు ఆంక్షల సడలింపుపై ఆలోచన చేస్తామన్నారు.