బిజీబిజీగా చీఫ్‌ సెక్రటరీ.. సమావేశం కోసం మంత్రి పడిగాపులు

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా సివిల్‌ సర్వీస్‌ బోర్డు(CSB)సమావేశం విషయంలో ఈ అభిప్రాయభేదాలు మరోసారి బయటపడ్డాయి. 

Published : 17 May 2023 13:48 IST

దిల్లీ: ఉన్నతాధికారి బిజీగా ఉండటం వల్ల ఓ కీలక సమావేశం ఆగిపోయింది. అందులో పాల్గొనేందుకు ఏకంగా మంత్రే రాత్రి వరకు వేచిచూసినా ప్రయోజనం లేకపోయింది. దిల్లీ మంత్రి(Delhi Minister), చీఫ్ సెక్రటరీ మధ్య ఈ పరిణామం చోటుచేసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  

సుప్రీంకోర్టు తీర్పుతో దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పరిశీలనకు సివిల్‌ సర్వీస్‌ బోర్డు(CSB) మంగళవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో దిల్లీ సర్వీసెస్ మినిస్టర్ సౌరభ్‌ భరద్వాజ్‌(Delhi Services Minister Saurabh Bharadwaj), చీఫ్‌ సెక్రటరీ నరేశ్‌ కుమార్‌(Chief Secretary Naresh Kumar), ఇతర అధికారులు పాల్గొనాల్సి ఉంది. అయితే రోజుమొత్తం నరేశ్ బిజీగా ఉండటం వల్ల మంత్రి భరద్వాజ్‌ వేచిచూడాల్సి వచ్చింది. రాత్రి 9.30 గంటల వరకు ఎదురుచూసినా.. ఆ ఉన్నతాధికారి మాత్రం హాజరుకాలేదు. దాంతో సమావేశం ఆగిపోయింది. 

దేశ రాజధాని దిల్లీ(Delhi)లో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో సీఎస్‌బీ మొదటిసారి సమావేశం కావాల్సి ఉండగా.. ఉన్నతాధికారి వల్ల నిలిచిపోయింది. 

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Chief Minister Arvind Kejriwal) చర్యలు తీసుకుంటున్నారు. సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరెను పదవి నుంచి తప్పించారు. అయితే  బదిలీ వేటుకు గురైన ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌.. అదృశ్యమవడం చర్చనీయాంశంగా మారింది. వాట్సప్‌ సందేశాలకూ ఆయన స్పందించడం లేదని, సెలవు సమాచారాన్ని ఇవ్వకుండా పరారీలో ఉన్నారని ఇదివరకు దిల్లీ సర్వీసెస్‌ శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఆయన స్థానంలో ఐఏఎస్ ఏకే సింగ్‌ను నియమిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఈ రెండు ఉత్తర్వులు అమలు కాలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు