Delhi: రూ.1400కోట్ల వ్యయంతో.. దిల్లీలో ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ వ్యవస్థ!

దేశరాజధానిలో త్వరలో సరికొత్త ట్రాఫిక్‌ (Delhi Traffic) నియంత్రణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రూ.1400 కోట్లతో చేపట్టిన ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (ITMS) వచ్చే ఏడాది చివరినాటికి పూర్తిగా అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

Published : 01 Jun 2023 01:02 IST

దిల్లీ: దేశ రాజధానిలో ట్రాఫిక్‌ (Delhi Traffic) నియంత్రణను మరింత సులువుగా చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధ (Artificial Intelligence) ఆధారిత ట్రాఫిక్‌ వ్యవస్థను తీసుకురానుంది. వచ్చే ఏడాది చివరినాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రూ.1400 కోట్ల ఖర్చుతో చేపడుతోన్న ఈ ప్రాజెక్టు.. వాహన రద్దీని తగ్గించడంతోపాటు వాహనాలు వేగంగా, సులువుగా కదిలేందుకు దోహదపడుతుందని దిల్లీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

అసోచామ్‌ (ASSOCHAM) ఏడవ రోడ్‌సేఫ్టీ సమావేశంలో నగర స్పెషల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ట్రాఫిక్‌) సురేందర్‌ సింగ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. 2024 చివరి నాటికి ఈ ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (ITMS) పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. రోడ్‌సేఫ్టీపై (Road Safety) సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్‌ కమిటీలో ఈయన కూడా ఓ సభ్యుడు. ‘ఐటీఎంఎస్‌ సాంకేతికత అనేది కృత్రిమ మేధ ఉపయోగించి వాస్తవికంగా ట్రాఫిక్‌ ఏవిధంగా ఉందో అన్న విషయాన్ని అంచనా వేస్తుంది. దీని అమలు తర్వాత నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి తీరు మారుతుంది. ట్రాఫిక్‌కు సంబంధించి ఎప్పటికప్పటి సమాచారాన్ని వాహనదారులకు చేరవేస్తుంది. వాహనాల రద్దీ, వాటి సరాసరి వేగం వంటి అంశాల ఆధారంగా పగటి సమయాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ స్వయంగా నిర్వహించుకుంటుంది. తద్వారా ట్రాఫిక్‌ నియంత్రణలో మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుతుంది’ అని పోలీస్‌ ఉన్నతాధికారి సురేందర్‌ సింగ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని