MCD polls 2022: ఓటేయాలని ఎంతో ఆశతో వచ్చాం.. కానీ!: దిల్లీ ఓటర్ల ఆగ్రహం
దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(MCD polls2022) నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివస్తోన్న పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(MCD Polls 2022) నిర్వహణలో అధికారుల వైఫల్యం ఓటర్లకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు ఎంతో ఆశగా తరలివస్తోన్న పలువురు ఓటర్లకు తీవ్ర నిరాశే ఎదురవుతోంది. తమ పోలింగ్ బూత్ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడంతో మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పోలింగ్ నిర్వహణ తీరుపట్ల ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్ బూత్ కోసం 2గంటలు తిరిగాం..!
దిల్లీలోని మొత్తం 250 వార్డులకు జరుగుతున్న త్రిముఖ పోరులో భాజపా-ఆప్-కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజలంతా బాధ్యతగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసినప్పటికీ.. ఓటేసేందుకు వచ్చిన కొందరు ఓటర్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో అనేకమంది అయోమయానికి, అసహనానికి గురవుతున్నారు. ఒక్కో ఓటరుకు ఒక్కోరకమైన అనుభవం ఎదురవుతోంది. ‘‘నేను ఒక గంటకు పైగా నా బిడ్డను పట్టుకొని పోలింగ్ బూత్ కోసం తిరుగుతున్నా. కానీ ఇప్పటికీ నా బూత్ ఎక్కడుందో తెలియలేదు. వేర్వేరు బూత్‌లకు అధికారులు పంపుతున్నారు. నా భార్య ఓటు వేసింది. కానీ నేను వేయలేకపోయా. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చినా ఎక్కడ ఓటు వేయాలో ఎవరికీ అర్థంకావడంలేదు’’ అని కౌల్ రామ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే, దాదాపు 20మందికి పైగా కుటుంబ సభ్యులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినా.. ఎక్కడ ఓటు వేయాలో తెలియక తిరిగి వెళ్లిపోతున్నట్టు ఓ మహిళ తెలిపారు. రెండు గంటల పాటు పోలింగ్ కేంద్రానికి తిరిగామని.. అక్కడ తమకు ఓట్లు లేవని చెప్పి వేర్వేరు బూత్‌లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ తమ ఓట్లు ఉన్నాయో తెలియకపోతే ఎలా వేయగలం అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
తొలిసారి ఓటేద్దామని వచ్చా..
‘‘గత రెండు గంటల వ్యవధిలో వివిధ పోలింగ్ కేంద్రాల్లోని ఏడెనిమిది బూత్‌లకు వెళ్లాలని అధికారులు సూచించారు. నేను నా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆశగా వచ్చాను. కానీ ఓటేయలేకపోయా. ఇది సరైన పద్ధతి కాదు. చివరకు ఓటు వేయకుండానే వెళ్లిపోతున్నా’’ అని తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉత్సాహంతో వచ్చిన యువతి వాపోయారు. అలాగే, వృద్ధులకూ ఇదేరకమైన సమస్య ఎదురవుతోంది. పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలుసుకొనేందుకు తాము ఒకచోట నుంచి ఇంకోచోటకు తిరిగే ఓపిక లేకపోవడంతో తిరిగివెళ్లిపోవాల్సి వస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.
ఓటర్ల జాబితాలో చాలా పేర్లు లేవు.. ఇదో కుట్ర: సిసోడియా
దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అనేకమంది పేర్లు గల్లంతయ్యాయని, ఇదంతా ఓ కుట్ర అని డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. అనేకమంది ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ జాబితాలోతమ ఓట్లు లేవని వాపోతున్నారన్నారు. ఓటరు జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. ఈ కుట్రపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు, ఓటరు జాబితాలు అప్డేట్ కాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనట్టు పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు చెబుతున్నారు. కొందరు ఓటర్ల సరైన అడ్రస్‌లు అప్డేట్ కాలేదని.. ఆధార్ కార్డులను లింక్ చేయకపోవడం, ఇతర సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు చెబుతున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భాజపా, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులకు గాను మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.45 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 4గంటల వరకు దాదాపు 45శాతం మేర పోలింగ్ నమోదైనట్టు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..