delhi water crisis: మిగులు జలాలపై మాట మార్చిన హిమాచల్‌

సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ నీటి సంక్షోభం అంశం పలు మలుపులు తిరుగుతోంది. దేశ రాజధానికి మిగులు జలాల విడుదలపై హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.

Published : 14 Jun 2024 04:28 IST

తొలుత ఉన్నాయంటూ... తర్వాత లేవంటూ...
రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన సుప్రీంకోర్టు
దిల్లీలో నీటిఎద్దడి తీవ్రత తెలియదా అంటూ ఆగ్రహం

దిల్లీ: సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ నీటి సంక్షోభం అంశం పలు మలుపులు తిరుగుతోంది. దేశ రాజధానికి మిగులు జలాల విడుదలపై హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలుత అందజేసిన సమాచారం ఆధారంగానే 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేయాలని ఈ నెల 7న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ నీరు ఇంకా దిల్లీకి చేరకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసింది. గురువారం విచారణ సందర్భంగా... తమ వద్ద మిగులు జలాలు లేవని, ఈ అంశంపై గతంలో ఇచ్చిన ప్రకటన సరైనది కాదని, దానిని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని హిమాచల్‌ప్రదేశ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్న వేళ మీ ప్రకటన పర్యవసానం ఏమిటో తెలియడం లేదా? ఇది అత్యవసరమైన విషయం కాకుంటే పెండింగ్‌లో ఉంచి మీపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే వాళ్లం’ అని ధర్మాసనం మండిపడింది. దీంతో అడ్వొకేట్‌ జనరల్‌ క్షమాపణలు తెలిపారు. తొలి ప్రకటనను వెనక్కి తీసుకుంటూ అఫిడవిట్‌ సమర్పిస్తానని తెలిపారు.

అనంతరం ధర్మాసనం... అదనపు నీటి సరఫరా కోసం అప్పర్‌ యుమున రివర్‌ బోర్డు(యూవైఆర్‌బీ)కు దరఖాస్తు చేసుకోవాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. యమునా నది జలాల పంపిణీ వివిధ రాష్ట్రాలతో ముడిపడిన సంక్లిష్ట, సున్నితమైన అంశమని పేర్కొంది. దీనికి సంబంధించిన సాంకేతిక నిపుణత కోర్టుకు లేనందున మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలేదని తెలిపింది. దిల్లీ ప్రభుత్వ అభ్యర్థనను సత్వరమే పరిశీలించి నీటిని విడుదల చేయాలని యూవైఆర్‌బీకి ధర్మాసనం సూచించింది. హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి అదనంగా నీరు అందించాలని కోరుతూ దిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగించింది. బుధవారం విచారణ సందర్భంగా.... ట్యాంకర్ల మాఫియా కట్టడికి, నీటి వృథా నివారణకు దిల్లీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ధర్మాసనం నిలదీసింది. దీంతో దిల్లీ పోలీసులు, ప్రభుత్వ అధికారులు పైప్‌లైన్ల వెంట, నీటి వనరుల చెంత తనిఖీలు ముమ్మరం చేశారు. హరియాణా వైపు నుంచి ట్యాంకర్ల మాఫియా కొనసాగుతున్నట్లుగా ఉందని దిల్లీ మంత్రి ఆతిశీ విలేకరులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు