SBI: గర్భిణుల నియామకాల్లో మార్పులపై ఆగ్రహం.. ఎస్‌బీఐకి నోటీసులు..!

నియామక సమయానికి మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌

Updated : 29 Jan 2022 16:19 IST

దిల్లీ: నియామక సమయానికి మూడు నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలిక అనర్హులుగా పేర్కొంటూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (SBI) జారీ చేసిన ఆదేశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన దిల్లీ మహిళా కమిషన్‌.. ఎస్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.

ఇది చాలా తీవ్రమైన అంశమని స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు విధుల్లో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులని ఎస్‌బీఐ ఆదేశాలివ్వడం వివక్షపూరితం. చట్టవ్యతిరేకం కూడా. 2020 కోడ్‌ ఆఫ్‌ సోషల్‌ సెక్యూరిటీ నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధం. దీనిపై వచ్చే మంగళవారం లోగా వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐకి నోటీసులు జారీ చేశాం. ఈ ఉత్తర్వులను ఆమోదించిన అధికారుల పేర్లు కూడా చెప్పాలని అడిగాం’’ అని స్వాతి ట్విటర్‌లో తెలిపారు. ఈ నోటీసులపై ఎస్‌బీఐ ఇంకా స్పందించలేదు.

‘‘నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారు. వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామ’ని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిన్న ఆదేశాలు జారీ చేసింది. నూతన నియామకాలకు ఈ నిబంధన 2021 డిసెంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. పదోన్నతులపై వెళ్లే వారికి 2022 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధన అమల్లోకి వస్తుందని బ్యాంక్‌ తెలిపింది. అయితే ఈ నిబంధనపై  ఆలిండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌తో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన నిబంధనను సత్వరం ఉపసంహరించాలని కోరుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వమ్‌ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని