Delhi: దిల్లీలో రెండు దాటిన ఆర్‌ వ్యాల్యూ..!

కొద్ది రోజులుగా దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

Published : 23 Apr 2022 13:27 IST

దిల్లీ: కొద్ది రోజులుగా దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వారం ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) 2.1 దాటింది. ఐఐటీ మద్రాస్ చేసిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది.  

కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్‌ వ్యాల్యూ ద్వారా అంచనా వేస్తారు. దీని విలువ ఒకటిగా ఉంటే.. ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకుతుంది. ఒకటి దాటిందంటే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్లే. కానీ దిల్లీలో ఈ విలువ ఇప్పుడు 2.1కి చేరుకుంది. భారత్‌ వ్యాప్తంగా 1.3గా ఉంది. ఐఐటీ మద్రాస్ బృందం చేసిన ప్రాథమిక విశ్లేషణలో భాగంగా ఈ విషయం వెల్లడైంది.

అయితే ఇది నాలుగో వేవ్‌కు సంకేతమా అని ప్రశ్నించగా.. ‘దిల్లీలో ఆర్‌ వ్యాల్యూ రెండు కంటే ఎక్కువగా ఉంది. అంటే వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి మరో ఇద్దరికి సోకుతుందని మాత్రం మేం చెప్పగలం. మరో కొత్త వేవ్ ప్రారంభమైందని ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. ప్రజల రోగనిరోధక స్థాయుల గురించి, మూడోవేవ్‌లో ప్రభావితమైన వ్యక్తులు మళ్లీ వైరస్ బారినపడతారా అనే వాటి గురించి తెలియదు’ అని ఆ బృందం వెల్లడించింది. అలాగే ఇతర మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, కోల్‌కతాలో కేసులు తక్కువగా ఉండటంతో..తాజాగా ట్రెండ్‌పై ఒక అంచనాకు రాలేమని చెప్పింది.

దిల్లీలో 24 గంటల సమయంలో 1,042 కొత్త కేసులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 4.64 శాతానికి చేరకుంది. ఇక్కడి పాజిటివ్‌ నమూనాల్లో ఎక్కువభాగం ఒమిక్రాన్ ఉప రకం BA.2.12 ఉన్నట్లు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలింది. తాజా వైరస్ వ్యాప్తికి ఇదే కారణం కావొచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే కొన్ని కేసుల్లో BA.2.12.1 గుర్తించినట్లు ఇన్సాకాగ్ వర్గాలు తెలిపాయి. ఈ వేరియంట్ అమెరికాలో తాజా విజృంభణకు దోహదం చేస్తోందని పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని