Delta Plus Updates: పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు!

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశం ఊపిరిపీల్చుకొంటున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. రోజుకో కొత్త రాష్ట్రానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి కేసు.....

Updated : 27 Jun 2021 06:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గడంతో ఇప్పుడిప్పుడే దేశం ఊపిరిపీల్చుకొంటున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. రోజుకో కొత్త రాష్ట్రానికి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాజస్థాన్‌లో తొలి కేసు నమోదైంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 52 కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ ముప్పునకు ఈ రకమే కారణమయ్యే అవకాశం ఉందంటోన్న నిపుణుల హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మరోసారి కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నాయి. 

రాజస్థాన్‌లో తొలి కేసు నమోదు

రాజస్థాన్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి కేసు నమోదైంది. బికనేర్‌లోని 65 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకినట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఓపీ చాహర్‌ వెల్లడించారు. ఆమెకు ఇంతకుముందే వైరస్‌ సోకగా.. పూర్తిగా కోలుకున్నారని, రెండు డోసుల టీకా కూడా తీసుకున్నట్టు వివరించారు. మే 30న ఆమె శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపగా.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు తెలిపారు. 

తమిళనాట తొలి మరణం
కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో తమిళనాడులో తొలి మరణం నమోదైంది. మదురైకి చెందిన ఓ వ్యక్తి డెల్టా ప్లస్‌ స్ట్రెయిన్‌తో మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఎమ్‌ఏ సుబ్రమణియన్‌ ధ్రువీకరించారు. రోగి మరణించిన తరువాత నమూనాలను సేకరించి పరీక్షించగా డెల్టా ప్లస్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు చెప్పారు. 

జమ్మూలో అతిపెద్ద ధాన్యపు మార్కెట్‌ మూత

డెల్టా ప్లస్‌ రకం ఆందోళన నేపథ్యంలో జమ్మూలోని అతి పెద్ద ధాన్యం మార్కెట్‌ మూతపడింది. జమ్మూలో తొలి కేసు నమోదు కావడంతో  స్థానిక వర్తకుల సమాఖ్య స్వచ్ఛందంగానే వీకెండ్ లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించింది. జమ్మూ సహా ఎనిమిది జిల్లాల్లో వీకెండ్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ఈ నెల 20న వెల్లడించినప్పటికీ..  జమ్మూకశ్మీర్‌లో డెల్టా ప్లస్‌ తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే నెహ్రూ మార్కెట్‌, ఆసియా చౌక్‌, విక్రమ్‌ చౌక్‌లలో దుకాణాలన్నీ మూసివేశారు. రానున్న మూడు వారాల్లో వీకెండ్‌ లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయించినట్టు వర్తకుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు దీపక్‌గుప్తా వెల్లడించారు. 

మధ్యప్రదేశ్‌లో 8కి చేరిన కేసులు

మధ్యప్రదేశ్‌లో డెల్టాప్లస్‌ రకం కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ వెల్లడించారు. మే నెలలో ఇద్దరు మృతిచెందినట్టు తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది కేసులు తమ దృష్టికి వచ్చాయని, టెస్టింగ్‌లను పెంచినట్టు చెప్పారు. డెల్టా ప్లస్‌ బారిన పడిన రోగుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదన్నారు. భోపాల్‌లో జీనోమ్‌సీక్వెన్సింగ్‌ కోసం ఓ ల్యాబరేటరీ ఏర్పాటు చేయాలని సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నిర్ణయించారన్నారు. వేర్వేరు మ్యుటేషన్ల బారిన పడుతున్నవారిని త్వరగా గుర్తించేలా ఒక జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ యంత్రం భోపాల్‌లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

థర్ఢ్‌వేవ్‌.. సెకండ్‌వేవ్‌ అంత తీవ్రంగా ఉండదు!

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా థర్డ్‌వేవ్‌ ఉండే అవకాశం లేదని ఐసీఎంఆర్‌ ఎపిడమాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సమీరన్‌ పాండా అన్నారు.  దేశంలో డెల్టా ప్లస్‌ కేసులు తక్కువగానే ఉన్నాయని, వీటితో థర్డ్‌వేవ్‌ ప్రారంభయ్యే సూచనలు లేవని చెప్పారు. భారీ వ్యాక్సినేషన్‌, కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడమే కరోనా దశలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై టీకాల ఏ మేరకు ప్రభావం చూపుతాయనే విషయంలో అధ్యయనం జరుగుతోందన్నారు. థర్డ్‌ వేవ్‌ మొదలైందని చెప్పడం తప్పుదారి పట్టించడమేనని అన్నారు.

టెస్ట్‌లు పెంచండి.. కేంద్రం  ఆదేశం

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైన నేపథ్యంలో కర్ణాటకను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ వైరస్‌ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జన సమూహాలను నియంత్రించడంతో పాటు భారీగా పరీక్షలు చేయాలని, వ్యాక్సినేషన్‌ను పెంచాలని సూచించింది. డెల్టా ప్లస్‌ కేసులు వస్తున్న జిల్లాలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ కర్ణాటక సీఎస్‌ పి.రవికుమార్‌కు లేఖ రాశారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, పంజాబ్‌, ఏపీ, కశ్మీర్‌, గుజరాత్, హరియాణా ప్రభుత్వాలకు కూడా లేఖ రాశారు. 

గోవాలో లాక్‌డౌన్‌ పొడిగింపు

పొరుగు రాష్ట్రాల్లో కేసులు వెలుగుచూడటంతో గోవా అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దుల్లో భారీ సంఖ్యలో పరీక్షలు చేస్తున్నట్టు సీఎం ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. కర్ణాటకతో ఉన్న కెరి- సట్టారి సరిహద్దు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని సరిహద్దుల వద్ద  పరిశీలన చేస్తున్నామన్నారు. మరోవైపు రాష్ట్రంలో జులై 5వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఇప్పటివరకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో 21 కేసులు రాగా.. గోవాలో ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు.

యూపీలో 100శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రారంభం

లఖ్‌నవూలోని కేజీఎంయూలో 100శాంపిల్స్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రారంభమైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. డెల్టా ప్లస్ వేరియంట్ ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని పేర్కొంది. యూపీ సీఎం  యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వారణాసి, నోయిడా, లఖ్‌నవూలోని మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో టెస్టింగ్‌ సదుపాయాలను పెంచాలని రాష్ట్ర ఆరోగ్యశాఖకు సూచించింది. అవసరమైతే ప్రైవేటు రంగం సహకారం తీసుకోవాలని ఆదేశించింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ఎదుర్కొనేలా అన్ని జిల్లాలు చురుకైన పాత్ర పోషించేలా బహుముఖ విధానాన్ని రూపొందించాలని సూచించింది.

నాగ్‌పూర్‌లో 4గంటలకు షాపులు బంద్‌!

డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో నెలకొన్న ఆందోళన నేపథ్యంలో నాగ్‌పూర్‌ పురపాలక సంస్థ (ఎన్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి నగరంలో కొత్త ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. నగరంలో అన్నిదుకాణాలను సాయంత్రం 4 గంటల కల్లా మూసివేయాలని ఆదేశించింది. మాల్స్‌, థియేటర్లు, మల్టీప్లెక్స్‌ థియేటర్లు మూసివేసి ఉంచాలని ఎన్‌ఎంసీ కమిషనర్‌ బి. రామకృష్ణన్‌ తెలిపారు. శని, ఆదివారాల్లో మాత్రం అత్యవసరం కాని దుకాణాలు మూసే ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ ఆందోళనకరమైనదిగా మారడంతో  లెవెల్‌ 3 అన్‌లాక్‌ ప్రక్రియ కింద ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సామాజిక/సాంస్కృతిక/ వినోద కార్యక్రమాలు, వివాహాలకు 50శాతం సామర్థ్యంతో సాయంత్రం 4గంటల లోపు నిర్వహించుకొనేందుకు అవకాశంకల్పించారు. ఈ కామర్స్‌ సర్వీసులను మాత్రం నిరంతరం కొనసాగేలా అవకశం ఇచ్చారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని