DeltaPlus variant: 3 రాష్ట్రాలకు పాకిన కొత్తరకం..!

భారత్‌లో కరోనా రెండోదశ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ.. ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఈ దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్..ఇప్పుడు మార్పులు చేసుకొని డెల్టాప్లస్‌ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి.

Updated : 24 Jun 2021 20:36 IST

దిల్లీ: భారత్‌లో కరోనా రెండోదశ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ.. వైరస్‌ ముప్పు మాత్రం తొలగిపోలేదు. ఈ దశలో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్.. ఇప్పుడు డెల్టాప్లస్‌ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. దాంతో ప్రభుత్వాలు ఈ కొత్తరకం ప్రభావాన్ని అంచనా వేసే పనిలోపడ్డాయి. అయితే ఇది ఇప్పటికే మూడు రాష్ట్రాలకు పాకినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికైతే కేంద్రం దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా మాత్రమే వర్గీకరించింది. దాని తీవ్రతను బట్టి ఆందోళనకర వేరియంట్‌గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది. 

‘ప్రస్తుతం దీన్ని వేరియంట్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా పరిగణించాం. ఆందోళనకర వేరియంట్‌గా ఇంకా వర్గీకరించలేదు. ఆందోళన కలిగించే వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు వ్యాధి తీవ్రతను పెంచుతుంది. డెల్టా ప్లస్ రకం గురించి తగిన సమాచారం కోసం చూస్తున్నాం’ అని కొద్ది రోజుల క్రితం నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. 

అయితే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌లో ఈ వేరియంట్ విస్తరించినట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 21 డెల్టాప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా రత్నగిరిలో తొమ్మిది కేసులు బయటపడగా.. జల్‌గావ్‌లో ఏడు, ముంబయిలో రెండు, పాల్ఘర్‌, ఠానే, సింధుదుర్గ్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగులోకి వచ్చినట్లు చెప్పింది. మే 15 నుంచి 7,500 నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టగా 21 కేసులను గుర్తించినట్లు పేర్కొంది. అలాగే ఈ వేరియంట్‌తో మహారాష్ట్రలో మూడోముప్పు పొంచి ఉందని ఆరోగ్యశాఖ ఇదివరకే అంచనా వేసింది. మరోపక్క కేరళలో మూడు కేసులు, మధ్యప్రదేశ్‌ ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో 64 ఏళ్ల మహిళ నుంచి సేకరించిన నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఏమారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడోముప్పుపై వార్తలు వస్తోన్న క్రమంలో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని