Arvind Kejriwal: ప్రజాస్వామ్యం గెలిచింది.. సుప్రీం తీర్పుపై ‘ఆప్‌’ హర్షం!

దిల్లీలో పాలనా సర్వీసులపై ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును.. ‘ప్రజాస్వామ్య విజయం’గా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివర్ణించారు. దీంతో దేశ రాజధాని అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందని చెప్పారు.

Published : 11 May 2023 16:36 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో పాలనా సర్వీసులపై స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయంటూ సుప్రీం కోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పుపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ (AAP) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య (Democracy) విజయమని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. దిల్లీ ప్రజలకు న్యాయం లభించిందని చెబుతూ.. సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తాజా నిర్ణయంతో దేశ రాజధాని అభివృద్ధి వేగం మరింత పుంజుకుంటుందన్నారు. మరోవైపు.. అధికారుల నియామకాలు, బదిలీల అధికారం ఇప్పుడు ఎన్నికైన ప్రభుత్వానికి దక్కిందని ‘ఆప్‌’ పేర్కొంది. కేంద్రం నియమించిన ఎల్జీ (LG)కి.. అధికారులపై ఎటువంటి నియంత్రణ ఉండదని ‘సుప్రీం’ తీర్పును ఉటంకించింది.

‘ఈ తీర్పు.. వారికి కఠిన సందేశం’

తాజా తీర్పును ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కీలకంగా అభివర్ణించారు. ‘సత్యమేవ జయతే. దిల్లీ గెలిచింది. ఇక్కడి అధికారులు.. స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలందించాలని.. పాలనను స్తంభింపజేసేందుకు కేంద్రం నియమించిన, ప్రజలు ఎన్నుకోని వ్యక్తుల (ఎల్‌జీ) ద్వారా కాదన్న కఠిన సందేశాన్ని తాజా తీర్పు పంపుతోంది’ అని పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు.. తమ ప్రభుత్వానికి దాని హక్కును కట్టబెట్టిందని ఆప్ సీనియర్ నేత, మంత్రి అతిశీ వ్యాఖ్యానించారు. ‘సీఎం కేజ్రీవాల్ దిల్లీ ప్రజల కోసం ఎనిమిదేళ్లు న్యాయ పోరాటం చేశారు. ఈరోజు ప్రజలు గెలిచారు’ అని మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. దిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణ అధికారం ఎవరికి ఉండాలనే వివాదంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది. దీంతో అరవింద్‌ కేజ్రీవాల్ సర్కారుకు అను సుప్రీంకోర్టు భారీ విజయం దక్కినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని