
ట్రంప్‌ను మీరు తప్పిస్తారా..లేదా?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. మరోవైపు ఆయన పాలక వర్గంలోని ఉన్నతాధికారులు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను తప్పించాలని డెమోక్రాటిక్ పార్టీ సభ్యులతో పాటు కొంతమంది రిపబ్లికన్ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు.
ట్రంప్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నవారిలో ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు సెనేట్ డెమోక్రాటిక్ నేత చక్ షుమెర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ మేరకు వారివురు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిని తొలగించాలని మైక్ పెన్స్‌ను కోరారు. లేదంటే సభలో అభిశంసన ప్రక్రియ మొదలుపెడతామని తేల్చి చెప్పారు. ‘‘అధ్యక్షుడు భయంకరమైన, దేశద్రోహ చర్యలకు పాల్పడిన దృష్ట్యా ఆయన్ని వెంటనే పదవి నుంచి తప్పించాల్సిన అవసరం ఉంది. 25వ సవరణ ద్వారా ఆయన్ని తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను కోరాం. ఇంత వరకూ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. త్వరలోనే ఆయన నుంచి సానుకూల సమాధానం వస్తుందని భావిస్తున్నాం. పెన్స్ సహా క్యాబినెట్ సభ్యులు వారు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నాం’’ అని పెలోసీ తెలిపారు.
ఒకవేళ పెన్స్ 25వ సవరణను ప్రయోగించకపోతే.. సభలో అభిశంసన ప్రక్రియ మొదలపెడతామని పెలోసీ, షుమెర్ వేర్వేరు ప్రకటనల ద్వారా తేల్చి చెప్పారు. దేశ ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విద్రోహ చర్యలకు కారణమైన వారికి ఇదే సరైన న్యాయమని ఎద్దేవా చేశారు. 1963లో అమెరికా రాజ్యాంగంలో ఈ 25వ సవరణ తీసుకొచ్చారు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా, పదవిని స్వచ్ఛందంగా వీడేందుకు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని అమలు చేయవచ్చు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించే స్థితిలో లేరంటూ ఉపాధ్యక్షుడు, మెజార్టీ కేబినెట్ నిర్ణయించడం ద్వారా ఆయనను పదవి నుంచి తప్పించే వీలుంటుంది.
మరోవైపు ట్రంప్ ఓటమిని బహిరంగంగా అంగీకరించిన విషయం తెలిసిందే. అధికార బదిలీకి సహకరిస్తానని హామీ ఇచ్చారు. జనవరి 20న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు. అయితే, అభిశంసన నుంచి తప్పించుకోవడానికే ట్రంప్ చివరి నిమిషంలో ఓటమిని అంగీకరించారని విమర్శలు వస్తున్నాయి. కనీసం మరో మరికొన్ని రోజులైనా తాను అధికారంలో ఉండాలని భావిస్తున్నారని ఆయన వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఆయనకు ఆ అర్హత లేదని పేర్కొన్నారు. ఆయన కేబినెట్లో ఒక్కొక్కరు రాజీనామా చేస్తుండడంతో ట్రంప్ అప్రమత్తమయ్యారన్నారు. కనీసం ఆ రకంగానైనా మరికొంత కాలం పదవిని కాపాడుకునేందుకు యత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.