Congress: నోట్ల రద్దుకు ఆరేళ్లు.. ఇది ‘అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ’

పెద్ద నోట్ల రద్దు జరిగి నేటితో ఆరేళ్లు పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, కోట్ల ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు చిన్న వ్యాపారస్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

Published : 09 Nov 2022 01:04 IST

దిల్లీ: నోట్ల రద్దు అనేది స్వతంత్ర భారత దేశంలో జరిగిన ‘అతిపెద్ద వ్యవస్థీకృత దోపిడీ’ అని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. 2016లో తీసుకున్న ఈ నిర్ణయంపై మోదీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. పెద్ద నోట్ల రద్దు జరిగి 6ఏళ్లు పూర్తైన సందర్భంగా మరోసారి విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఆ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని దుయ్యబట్టింది.

‘భారీ స్థాయిలో నగదు చలామణి అవుతోందని భావించిన భాజపా ప్రభుత్వం.. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ, నవంబర్‌ 2016 నాటికి దేశంలో రూ.17.97కోట్ల నగదు చలామణిలో ఉంటే.. ప్రస్తుతం అది రూ.30.8లక్షల కోట్లకు చేరింది. నల్లధనం రాలేదు కానీ, పేదరికం వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది’ అని కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ వల్లభ్‌ ఆరోపించారు.

‘ఉగ్రవాదం అంతం కాలేదు కానీ, చిన్న వ్యాపారస్థులు మాత్రం చితికిపోతున్నారు. కోట్ల ఉద్యోగాలు పోయాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని గౌరవ్‌ వల్లభ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనానికి నోట్ల రద్దు కారణమైందన్న ఆయన.. ఈ వైఫల్యాన్ని ప్రధానమంత్రి ఇంకా అంగీకరించడం లేదని మండిపడ్డారు. అసంఘటిత రంగంతోపాటు సూక్ష్మ, మధ్యతరహా వ్యాపారస్థులు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికను విడుదల చేయాలన్నారు.

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్ల ధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా నవంబర్‌ 8, 2016న రూ.500, రూ.1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని