Rahul Gandhi: నోట్ల రద్దుకు ఆరేళ్లు.. PayPM అంటూ రాహుల్‌ ఫైర్‌

పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తన బిలియనీర్‌ స్నేహితుల కోసమే ఈ చర్య చేపట్టారని మండిపడ్డ ఆయన.. ప్రధానిని పేపీఎంగా అభివర్ణిస్తూ దుయ్యబట్టారు.

Published : 08 Nov 2022 17:55 IST

దిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయానికి నేటితో ఆరేళ్లు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధాని పేపీఎం (PayPM) అంటూ విమర్శించారు. తన బిలియనీర్‌ స్నేహితుల కోసం మోదీ తీసుకొచ్చిన ఉద్దేశపూర్వక చర్య ఇది అని మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

‘‘చిన్న, మధ్యతరహా వ్యాపారాలను సమూలంగా తుడిచిపెట్టి.. తద్వారా తన బిలియనీర్‌ స్నేహితులైన ఇద్దరు ముగ్గురికి భారత ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం అందించడం కోసం PayPM ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన చర్య ఈ నోట్ల రద్దు’’ అని రాహుల్‌ ట్వీట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. నోట్ల రద్దు విఫల చర్య అని సమర్థించేలా ఉన్న పలు కథనాలు, అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాలను ఆ వీడియోలో చూపించారు. నోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చూపించారు. కేంద్రం, రాష్ట్ర స్థాయిల్లో భాజపా నేతలపై అవినీతి ఆరోపణలను గానూ కాంగ్రెస్‌ పేసీఎం (PayCM), పేపీఎం (PayPM) పదాలను ఉపయోగిస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే.

2016 నవంబరు 8న రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చడంతో పాటు అవినీతి, నల్లధనాన్ని అరికట్టేందుకే నోట్ల రద్దు చేపట్టామని కేంద్ర ప్రభుత్వం అప్పుడు తెలిపింది. అయితే, అందులో కేంద్రం విఫలమైందని, నోట్ల రద్దు చేపట్టి ఆరేళ్లయినా ఇప్పటికీ దేశంలో నగదు చలామణి అధికంగా ఉందని కాంగ్రెస్‌ విమర్శించింది. అక్టోబరు 21 నాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 30.88లక్షల కోట్లతో కొత్త గరిష్ఠానికి చేరిందని, ఆరేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 72శాతం ఎక్కువని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు