Dushyant Singh Chautala: పొగమంచు కారణంగా హరియాణా డిప్యూటీ సీఎం కారుకు ప్రమాదం..!

ఉత్తర భారత దేశంలో పొగమంచు తీవ్రంగా ఉంది. హరియాణ డిప్యూటీ సీఎం వాహనం పొగమంచు కారణంగా ప్రమాదానికి గురైంది. 

Updated : 20 Dec 2022 11:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర భారత దేశంలో పొగమంచు తీవ్రంగా ఉంది. హరియాణాలో పొగ మంచు కారణంగా డిప్యూటీ సీంఎ దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా(Dushyant Singh Chautala) వాహన శ్రేణి రోడ్డు ప్రమాదానికి గురైంది. సోమవారం రాత్రి ఆయన హిస్సార్‌ నుంచి సిర్సాకు ప్రయాణిస్తుండగా అగ్రోహా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ప్రమాదం నుంచి చౌతాలా సురక్షితంగా బయటపడగా.. ఓ పోలీస్‌ అధికారి గాయపడ్డారు. దుష్యంత్‌ (Dushyant Singh Chautala) వాహనశ్రేణి అగ్రోహాలోని బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌ దాటుతుండగా ఓ వాహనం బ్రేక్‌ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకొంది. 

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధా నగర్‌లో మంగళవారం ఉదయం పొగమంచు కారణంగా ఓ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పంజాబ్‌, హరియాణా, ఛండీగడ్‌, దిల్లీ, ఉత్తర రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో భారీగా పొగమంచు పడిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రహదారులపై ఎదుటి వాహనాలు ఏమాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. దిల్లీలోని పాలెం ప్రాంతంలో 25 మీటర్ల దూరంలో ఏమున్నదో కూడా కనిపించని పరిస్థితి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బటిండాలో విజిబులిటీ సున్నా మీటర్లుగా నమోదైంది. ఇక అమృత్‌సర్‌, గంగానగర్‌, పటియాలా, లఖ్‌నవూలో 25 మీటర్లుగా ఉంది. పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో నేడు, రేపు పొగమంచు భారీగా పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దిల్లీ ఎయిర్‌పోర్టులో ఫాగ్‌ అలర్ట్‌ను జారీ చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని