Dera Baba: అనారోగ్యం పాలైన డేరా బాబా

డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో పటిష్ఠ భద్రత నడుమ పోలీసులు ఆయన్ను

Updated : 03 Jun 2021 18:48 IST

ఛండీగఢ్‌: డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అనారోగ్యానికి గురయ్యారు. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో పటిష్ఠ భద్రత నడుమ పోలీసులు ఆయన్ను పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (పీజీఐఎంస్‌)కు తరలించారు. ఉదరభాగానికి  సీటీస్కాన్‌ చేయించి, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు. విపరీతమైన నీరసం, రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉండటంతో మూడు వారాల క్రితం గుర్మీత్‌ ఇదే ఆస్పత్రిలో చేరారు. అయితే ఓ రాత్రిపాటు ఆయన్ను పరీక్షించిన ఏడుగురు సభ్యుల వైద్య బృందం  ఆ తర్వాత డిశ్ఛార్జి చేసింది. తాజాగా మరోసారి కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో 2017 నుంచి రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల క్రితం నాటి అత్యాచార కేసులో సీబీఐ కోర్టు ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  

సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్‌  ఆ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను వంధ్యులుగా మార్చారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పలువురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేసేవారని చెబుతుంటారు. మరోవైపు గుర్మీత్‌.. డేరా సచ్చా సౌదా కార్యకర్తలకు మారణాయుధాల శిక్షణ ఇప్పిస్తున్నారని జాతీయ భద్రత సలహా కమిటీ  అప్పట్లో ఆరోపించింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో ఆ కేసుకు తెరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని