Gurmeet Ram Rahim Singh: ఎన్నికల వేళ ఇటీవల విడుదల.. ఇప్పుడు జడ్‌ ప్లస్ భద్రత..!

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హరియాణా ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Published : 22 Feb 2022 13:42 IST


చండీగఢ్: డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు హరియాణా ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖలిస్థాన్‌ అనుకూల వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందనే నివేదికల మధ్య గుర్మీత్‌కు భద్రత పెంచింది.

పాత్రికేయుడి హత్య, ఇద్దరు డేరా శిష్యురాళ్లపై అత్యాచారం కేసుల్లో గుర్మీత్ దోషిగా ఉన్నాడు. ప్రస్తుతం రోహ్‌తక్‌లోని సునారియా జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కాగా, ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన వేళ.. ఫిబ్రవరి ఏడున 21 రోజుల పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాబాకు వేలసంఖ్యలో అనుచరగణం ఉంది. దాంతో ఎన్నికల ముందు అతడి విడుదల తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన అతడికి.. ఖలిస్థాన్‌ అనుకూల వర్గం నుంచి ప్రాణహాని ఉందని నివేదికలు రావడంతో హరియాణా ప్రభుత్వం జడ్‌ ప్లస్ భద్రతను కల్పించింది.

2017 నుంచి జీవిత ఖైదు అనుభవిస్తోన్న 54 ఏళ్ల డేరాబాబా..పెరోల్‌పై విడుదల కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వైద్య చికిత్స కోసం రెండుసార్లు, అనారోగ్యంతో ఉన్న తల్లిని కలిసేందుకు ఓసారి పెరోల్ పొందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని