Deregistering Diesel Vehicles: ఆ డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాల్సిందే!

దేశ రాజధాని దిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిసస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న ఆదేశాలను మార్చేది లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన దరఖాస్తులను ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌....

Published : 14 Aug 2021 17:24 IST

తేల్చి చెప్పిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలన్న ఆదేశాలను మార్చేది లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన దరఖాస్తులను ఎన్జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అలాగే సుప్రీంకోర్టు సైతం ఈ తరహా అప్పీళ్లను గతంలోనే తిరస్కరించినట్లు గుర్తుచేసింది.

పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలు దిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతించొద్దని ఏప్రిల్‌ 7, 2015న ఎన్జీటీ సంబంధిత శాఖను ఆదేశించింది. అనంతరం దశలవారీగా ఇలాంటి వాహనాలను డీరిజిస్టర్‌ చేయాలంటూ 2016, జులై 18న ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు తొలుత రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దిల్లీ వెలుపల వీటిని నడిపేందుకు నిరభ్యంతర పత్రం కూడా ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ వారికి మొండిచేయి ఎదురైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో డీజిల్‌ వాహనాల రద్దు ఆదేశాల్ని సవరించాలని కోరుతూ ఎన్జీటీలో హరియాణా ‘ప్రోగ్రెసివ్‌ స్కూల్క్‌ కాన్ఫరెన్స్‌’ అప్పీల్‌ దాఖలు చేసింది. కొవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో పదేళ్ల కాలవ్యవధిని పొడిగించాలని కోరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ అందుకు నిరాకరించింది. పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలను డీరిజిస్టర్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలాంటి వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు మనుషుల ఆరోగ్యానికి హానికరం కాదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నిరూపించలేకపోయిందని తెలిపింది. ఉద్గారాల విడుదలలో ఒక్క డీజిల్‌ కారు.. 24 పెట్రోల్‌ లేదా 84 సీఎన్‌జీ కార్లతో సమానమని కాలుష్య నియంత్రణ మండలి తెలిపినట్లు గుర్తుచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని