Derek OBrien: ‘నేను పార్లమెంట్‌లో ఉన్నప్పుడు.. ఆ బాక్సింగ్ ఛాంప్‌ ప్రాక్టీస్ చూశాను’

కొద్ది రోజుల్లో పదవీ విమరణ చేయనున్న రాజ్యసభ ఎంపీలకు గురువారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రానున్న రోజుల్లో మొత్తం 72 మంది సభను వీడనున్నారు.

Published : 01 Apr 2022 01:37 IST

పదవీ విరమణ పొందనున్న రాజ్యసభ ఎంపీలపై డెరెక్ కవిత

దిల్లీ: కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ ఎంపీలకు గురువారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. రానున్న రోజుల్లో మొత్తం 72 మంది సభను వీడనున్నారు. వీరిలో కొందరు తిరిగి నామినేట్ అయ్యే అవకాశమూ ఉంది. అయితే వెళ్లిపోతున్న సభ్యులను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్ ఓ కవిత వినిపించారు. ‘నేను నా మనమలు/ మనుమరాళ్లకు చెప్తాను’ అంటూ సభ్యులతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు.  

‘• నేను పార్లమెంట్‌లో ఉన్నప్పుడు.. ఇద్దరు మాజీ ప్రధానులు మా పక్కనే కూర్చున్నారు. ఒకరు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఇంకొకరు దెవెగౌడ. 

• నేను పార్లమెంట్‌లో ఉన్నప్పుడు ఒక ప్రపంచ ఛాంపియన్‌(మేరీకోమ్‌).. పురుష ఎంపీలతో కలిసి బాక్సింగ్ పంచ్‌లు ప్రాక్టీస్ చేయడం చూశాను. 

• నేను పార్లమెంట్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న వేళ.. ఒక ఎంపీతో కలిసి ఫెర్రీ సర్వీస్‌ను ఉపయోగించుకున్నాను. కానీ దాన్నుంచి దిగగానే ఇవ్వడానికి నా దగ్గర రూ.10 కూడా లేవు. అయితేనేం, నేను సైద్ధాంతికంగా వ్యతిరేకించే ఆ విపక్ష పార్టీ సభ్యుడి నుంచే ఆ డబ్బు తీసుకున్నాను.

• పార్లమెంట్‌లో ఒక సెంట్రల్ హాల్ ఉండేది. అక్కడ మేం బోలెడు కబుర్లు చెప్పుకునేవాళ్లం. మార్చి నెలలో ఎండ భగ్గుమంటున్న వేళ.. మేమంతా ఒక ఫొటో దిగాం. అందులో నన్ను గుర్తుపట్టగలరా? అని వారిని అడిగితే.. ‘దాదా అది మీరా..? మీరు చిన్నపిల్లాడిలా ఉన్నారు’ అంటూ వారు నన్ను ఆటపట్టిస్తారు’’ అంటూ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని పిల్లలతో సంభాషించినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ వీడియోను డెరెక్ నెట్టింట్లో షేర్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో సభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు చిరునవ్వు చిందించారు. 

టీఎంసీ నేత అయిన డెరెక్..కేంద్ర ప్రభుత్వ విధానాలను సూటిగా ప్రశ్నిస్తుంటారు. ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. కానీ ఈ రోజు మాత్రం విభిన్నంగా స్పందించి, తన విమర్శలకు విశ్రాంతి ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని