Amruta Fadnavis: అమృతా ఫడణవీస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసి.. రూ.10కోట్లు డిమాండ్‌..!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య అమృతా ఫడణవీస్‌ను(Amruta Fadnavis) బ్లాక్‌మెయిల్‌ చేసిన డిజైనర్‌.. ఆమె నుంచి రూ.10కోట్లు లాగేందుకు యత్నించింది. నకిలీ వీడియోలు పంపించి అమృతను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

Updated : 18 Mar 2023 12:21 IST

డిజైనర్‌ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సతీమణి అమృతా (Amruta Fadnavis)కు రూ. కోటి ఇవ్వజూపిన డిజైనర్‌ అనిక్ష జైసింఘానీ (Aniksha Jaisinghani) కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన తండ్రిని కేసుల నుంచి బయటపడేసేందుకు తొలుత లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన అనిక్ష.. అది కుదరకపోవడంతో అమృతా ఫడణవీస్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ముంబయి పోలీసులు (Mumbai Police) వెల్లడించారు. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే అమృతకు చెందిన కొన్ని వీడియోలను వైరల్‌ చేస్తానని ఆ డిజైనర్‌ బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై తాజాగా బలవంతపు వసూళ్ల (Extortion) కేసు నమోదు చేశారు.

అనిక్షపై ఇప్పటికే అమృతా ఫడణవీస్‌ (Amruta Fadnavis) బ్లాక్‌మెయిల్‌ (Blackmail), బెదిరింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆమె తన తండ్రి అనిల్‌ జైసింఘానీకి సంబంధించిన క్రిమినల్‌ కేసులను మాఫీ చేయించేందుకు రూ.కోటి ఇవ్వజూపిందని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఇందుకు అమృత అంగీకరించకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అనిక్ష, ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదైన రెండు రోజుల తర్వాత ఆ డిజైనర్‌.. అమృతకు రెండు వీడియోలను పంపింది. ఆ వీడియోల్లో డబ్బు ఉన్న బ్యాగును అమృత (Amruta Fadnavis)కు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు రూ.10కోట్లు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను వైరల్ చేస్తానని ఆమె అమృతను బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియోలను పరిశీలించగా.. అవి మార్ఫింగ్‌ చేసినవిగా తేలినట్లు పేర్కన్నారు. దీంతో ఆ డిజైనర్‌పై బలవంతపు వసూళ్లకు యత్నించినట్లు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోలను రూపొందించిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘బెదిరించింది.. రూ. కోటి ఇస్తానంది’: డిజైనర్‌పై అమృతా ఫడణవీస్‌ కేసు

పోలీసులపైకే శునకాలను వదిలేసి.. ఎవరీ అనిల్‌ జైసింఘానీ

ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డిజైనర్‌ అనిక్ష తండ్రి అనిల్‌ జైసింఘానీ పేరు మోసిన అంతర్జాతీయ క్రికెట్‌ బుకీ అని తెలుస్తోంది. ఐపీఎల్‌ సమయంలో కోట్లాది రూపాయాలతో బెట్టింగ్‌లు నిర్వహించే అనిల్‌.. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండేందుకు పోలీసులకు భారీగా లంచాలు ఇస్తుంటాడట. ఆ తర్వాత వాటిని వీడియోలు తీసి పోలీసులను బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటాడని తెలిసింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ NCP) తరఫున అనిల్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశాడు. అతడి వద్ద ఖరీదైన పెంపుడు శునకాలు ఉన్నాయి. కేసు విచారణ నిమిత్తం పోలీసులు అతడి ఇంటికి వెళ్తే.. వారిపైకి శునకాలను వదిలి భయపెట్టేవాడని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నారు. రాజకీయ నేతల అండతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న అనిల్‌పై ఇప్పటికే 15 వరకు కేసులున్నాయి. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా అతడు పరారీలో ఉన్నాడు.

కాగా.. అమృతా ఫడణవీస్‌ (Amruta Fadnavis)పై బెదిరింపులకు పాల్పడిన కేసులో గత గురువారం అనిక్షను అరెస్టు చేశారు. నిన్న ఆమెను కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో న్యాయస్థానం ఆమెకు మార్చి 21 వరకు పోలీసు కస్టడీ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని