Updated : 01 Jun 2021 10:51 IST

lockdown: పని ఇప్పించండి.. కూలీగా కూడా చేస్తా

ఓ పోస్టు గ్రాడ్యుయేట్ నిరుద్యోగి ఆవేదన

దిల్లీ: ‘నాకు ఏదైనా పని ఇప్పించి, సాయం చేయండి. ఈ లాక్‌డౌన్ వల్ల బతకడం కష్టంగా మారింది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి నాకు ఏ పనీ లభించడం లేదు. ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.. కానీ నాకు అసలు పనే దొరకడం లేదు. రోజూవారీ కూలీగా పనిచేయడానికి కూడా నేను సిద్ధమే’ అంటోన్న ఓ యువకుడి ఆవేదన ఇప్పుడు నెటిజన్లను మెలిపెడుతోంది. ఈ పోస్టు పెట్టింది ఓ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి. పైగా యూజీసీ లెక్చరర్‌ ఉద్యోగాల కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హతా పరీక్షను కూడా అతడు పాసయ్యాడు. తను చదివిన చదువును పక్కన పెట్టి, పొట్టపోసుకునేందుకు ఏ పనైనా చేస్తాననే దీనస్థితికి వచ్చాడు. దీనికంతటికీ కారణం కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం. దాని కట్టడికి ప్రభుత్వాలు విధిస్తోన్న లాక్‌డౌన్‌లు, ఆంక్షలు. 

మొదటి దశలోనే కరోనా పలువురి ఉపాధిని, ఆరోగ్యాన్ని దెబ్బతీయగా.. రెండో దశలో అది మరీ తీవ్రమైంది. కుటుంబ పోషణకు తమ స్థాయిని పక్కనపెట్టి దొరికిన పని చేస్తోన్న వ్యక్తుల ఉదంతాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇప్పుడు వికాస్ పేరు మీద ఓ యువకుడు పెట్టిన పోస్టు కూడా ఆ తరహాదే. తాజాగా ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.‘నేను దిల్లీలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టా పొందాను. నేను డ్రైవర్‌గా కూడా పనిచేయగలను. మీరు చేసే సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ముందస్తుగా కృతజ్ఞతలు’ అంటూ ఆ వ్యక్తి మరో ట్వీట్ చేశాడు. అలాగే బస్తాలు మోస్తూ ఉన్న ఒక చిత్రాన్ని షేర్ చేశాడు. అంతేకాక అతడు షేర్ చేసిన రెజ్యూమేను బట్టి.. ఆంగ్ల సాహిత్యంలోనూ ఎంఏ చేసినట్టుగా తెలుస్తోంది.  

కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. కొందరు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వగా.. మరికొందరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘పాలకవర్గం ఇకనైనా సామాన్య ప్రజల కష్టాలను గ్రహిస్తుందని ఆశిస్తున్నాం’ అని మరొకరు ఆవేదన వెళ్లగక్కారు. 


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని