టీకాల అభివృద్ధి గొప్ప విజయం: రాష్ట్రపతి

భారత్‌లో దేశీయంగా రెండు కొవిడ్‌ టీకాలను అభివృద్ధి చేయడం గొప్ప విజయమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ప్రవాసీ భారతీయ దివస్‌-2021’ కార్యక్రమంలో ఎన్నారైలను ఉద్దేశించి........

Published : 09 Jan 2021 22:11 IST

దిల్లీ: భారత్‌లో దేశీయంగా రెండు కొవిడ్‌ టీకాలను అభివృద్ధి చేయడం గొప్ప విజయమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ప్రవాసీ భారతీయ దివస్‌-2021’ కార్యక్రమంలో ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచ క్షేమమే స్ఫూర్తిగా చేపట్టిన ఆత్మనిర్భర్‌ అభియాన్‌ కింద మనం దేశీయంగా రెండు కొవిడ్‌ టీకాలను అభివృద్ధి చేయడమంటే.. గొప్ప విజయం సాధించడమే. 2020 ఏడాదిలో కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లపై పోరాటంలో భారత్‌ ముందంజలో ఉంది. దాదాపు 150 దేశాలకు మందులు సరఫరా చేశాం. దీంతో ప్రపంచం మన ఫార్మా రంగం వైపు చూసేలా చేశాం’ అని రాష్ట్రపతి వెల్లడించారు.

ప్రవాసీల సహాయ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ..  ‘కొవిడ్‌-19 సమయంలో పలు దేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వృద్ధులు, కష్టాల్లో ఉన్న పలువురికి ప్రవాస భారతీయులు నిధులు సమకూర్చి గొప్ప సహాయం చేశారు. మన దేశ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రవాసీలు చేస్తున్న కృషికి నేనెంతో గర్విస్తున్నా. కొవిడ్‌ సమయంలో ప్రయాణ అంతరాలు ఏర్పడిన సమయంలో.. భారత విదేశాంగ శాఖతో పాటు, విదేశాల్లోని మన మిషన్లు పోషించిన పాత్ర ఎంతో కీలకం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలలోనూ మన వారున్నారు. భారత్‌ అభివృద్ధిలోనూ ప్రవాసీలు ఆలోచనలు పంచుకుని భాగస్వామ్యం అయ్యేందుకు ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానిస్తున్నా. 2003లో భారతరత్న వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనే ప్రవాసీ దివస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రవాసీలతో సంబంధాలు కొనసాగేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మనం ఆయనకు రుణపడి ఉండాలి’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

ఇదీ చదవండి

మన టీకాల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని