AirIndia: కాక్‌పిట్‌లోకి స్నేహితురాలు.. సిబ్బందిపై చర్యలకు డీజీసీఏ ఆదేశం!

ఎయిరిండియా (AirIndia) విమానం కాక్‌పిట్‌ (Cockpit)లోకి స్నేహితురాలిని తీసుకెళ్లిన పైలట్‌ (Pilot)ను విధులకు దూరంగా ఉంచాలని విమానయాన సంస్థకు డీజీసీఏ సూచించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

Published : 27 Apr 2023 00:59 IST

దిల్లీ: ఎయిరిండియా (AirIndia) విమానం కాక్‌పిట్‌ (Cockpit)లోకి పైలట్‌ (Pilot) తన స్నేహితురాలని తీసుకొచ్చిన వ్యవహారంలో పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై విచారణ ముగిసేంత వరకు ఆ విమానంలో ఉన్న సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని ఎయిరిండియా సంస్థకు సూచించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటన ఏప్రిల్‌ 21న వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో క్యాబిన్‌ సిబ్బంది ప్రమేయం లేకపోయనప్పటికీ.. విచారణ ముగిసే వరకు విమానంలో ఉన్న సిబ్బంది మొత్తాన్ని విధులకు దూరంగా ఉంచాలని డీజీసీఏ ఆదేశించినట్లు తెలిపారు. అలానే, తుది నిర్ణయం వెలువడే వరకు పైలట్‌ విధులకు హాజరుకాకుండా చర్యలు తీసుకోవాలని సదరు విమానయాన సంస్థకు సూచించారు. తాజా పరిణామాలపై ఎయిరిండియా స్పందించాల్సి వుంది. 

ఫిబ్రవరి 27న దుబాయ్‌ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు పైలట్‌కు స్నేహితురాలు. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి పైలట్‌ ఆమెను కాక్‌పిట్‌లో కూర్చొబెట్టారు. అలా, ఆమెను సుమారు మూడు గంటల సమయం కాక్‌పిట్‌లోని ఫస్ట్‌ అబ్జర్వర్‌ సీట్‌లో కూర్చోబెట్టినట్టు అధికారులు తెలిపారు. అలానే, ఆమెకు ప్రత్యేక సేవలు అందించాలని విమాన సిబ్బందిని సదరు పైలట్‌ ఆదేశించినట్లు సమాచారం. అందుకు అంగీకరించని సిబ్బందిపై ఆయన దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై క్యాబిన్ సిబ్బందిలో ఒకరు డీజీసీఏకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎయిరిండియా స్పందిస్తూ.. ‘అనుమతిలేని వ్యక్తులను కాక్‌పిట్‌లోకి అనుమతించడం నిషేధం. ఇది పూర్తిగా ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించే చర్య. దీనికి పైలట్‌ క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది’ అని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని