DGCA: విమానంలో మాట వినకుంటే.. అరెస్ట్‌ తప్పదు!

విమాన ప్రయాణికుల(Air Pasengers) అనుచిత ప్రవర్తనను అడ్డులేకపోవడం.. విమాన భద్రత నియమాలను ఉల్లఘిండమేనని డీజీసీఏ (DGCA) వ్యాఖ్యానించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు (Airlines), విమాన సిబ్బందికి మరోసారి కీలక సూచనలు చేసింది. 

Published : 10 Apr 2023 22:37 IST

దిల్లీ: విమానాల్లో (Flights) నిబంధనలు పాటించకుండా అనుచిత ప్రవర్తనతో సిబ్బందిని, తోటి ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేసే ప్రయాణికులతో విమాన సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని డీజీసీఏ (DGCA) సూచించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విమాన ప్రయాణికుల(Air Pasengers) అనుచిత ప్రవర్తనను అడ్డులేకపోవడం.. విమాన భద్రత నియమాలను ఉల్లంఘించడమేనని డీజీసీఏ వ్యాఖ్యానించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు (Airlines), విమాన సిబ్బందికి మరోసారి కీలక సూచనలు చేసింది. 

‘‘ఇటీవలీ కాలంలో కొందరు ప్రయాణికులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. విమానంలో పొగ త్రాగడం, మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడం, తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం వంటి  ఘటనలు జరిగాయి. ఆ సమయంలో విమాన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది సదరు ప్రయాణికుల చర్యలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. సిబ్బంది వారిని అదుపు చేయలేకపోతే, అది విమాన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తిస్తే, వారు ఎదుర్కోబోయే పరిణామాలను తెలియజేయాలి. అప్పటికీ వారు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తే.. విమానం ల్యాండ్ అయిన తర్వాత వారిని అరెస్ట్‌ చేయించాలి’’ అని విమాన సిబ్బందికి డీజీసీఏ సూచించింది. 

దిల్లీ నుంచి లండన్‌ వెళుతున్న ఎయిరిండియా (Air India) విమానంలో ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగి, వారిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీంతో పైలట్‌ విమానాన్ని వెనక్కి మళ్లించి, దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో  దించేశాడు. అనంతరం సదరు ప్రయాణికుణ్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుకాగా, ప్రయాణికుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని