DGCA: విమాన సంస్థలు అలా చేస్తే ఉచిత ప్రయాణం.. త్వరలో డీజీసీఏ కొత్త నిబంధన

విమానంలో మీరు ఓ తరగతిలో ప్రయాణించడానికి టికెట్లు తీసుకున్నాక.. మీ ప్రమేయం లేకుండానే విమానయానసంస్థ వాటిని దిగువ తరగతికి బదిలీ చేసిందా?

Updated : 24 Dec 2022 07:40 IST

దిల్లీ: విమానంలో మీరు ఓ తరగతిలో ప్రయాణించడానికి టికెట్లు తీసుకున్నాక.. మీ ప్రమేయం లేకుండానే విమానయానసంస్థ వాటిని దిగువ తరగతికి బదిలీ చేసిందా? ఇకపై ఇలా చేస్తే మీ ప్రయాణానికి పూర్తి ఖర్చును సదరు సంస్థే భరించేలా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిబంధన తీసుకురానుంది. దీని ప్రకారం ‘ప్రయాణికుడి ఎగువ తరగతి టికెట్‌ను విమానయాన సంస్థ దిగువ తరగతికి బదిలీ చేస్తే.. టికెట్‌ కొనుగోలు చేసినపుడు సదరు ప్రయాణికుడు పన్నులతో సహా ఎంతైతే చెల్లించాడో అంత మొత్తాన్నీ అతడికి చెల్లించాలి. అంతేకాకుండా దిగువ తరగతిలో అతడికి ఉచిత ప్రయాణాన్నీ అందించాలి’ అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్రమేయం, అనుమతి లేకుండా విమానయాన సంస్థలు ఇష్టానుసారం తాము తీసుకున్న టికెట్లను దిగువ తరగతికి బదిలీ చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత వ్యాపార భాగస్వాములతో చర్చించిన అనంతరం ఫిబ్రవరిలో ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

ఫ్లైట్‌ రద్దు అయితే?..

విమానయాన సంస్థ తమ విమానాన్ని రద్దు చేయాలని భావిస్తే 2 వారాల ముందుగానే ప్రయాణికులకు తెలిపి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. ప్రయాణానికి ఒక రోజు లేదా రెండు వారాల లోపు రద్దు చేస్తే.. ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి లేదా టికెట్‌ సొమ్మును తిరిగి చెల్లించాలి. 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ఎయిర్‌లైన్‌ సంస్థ విమానాన్ని రద్దు చేస్తే.. ప్రయాణికులకు అత్యధికంగా రూ.10 వేల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలను డీజీసీఏ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని