Petrol: ధరలు పెరగడానికి కారణమిదే: కేంద్రమంత్రి

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల మంటలు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం కూడా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 27పైసలు చొప్పున వడ్డించడంతో ....

Published : 07 Jun 2021 18:06 IST

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల బాదుడు కొనసా..గుతూనే ఉంది. తాజాగా సోమవారం కూడా పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 27పైసలు చొప్పున వడ్డించడంతో పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన ధరలు ఇంతలా పెరిగిపోవడానికి అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలే కారణమన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇటీవలి కాలంలో ఖరీదైపోయాయన్నారు. పెట్రోల్‌ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలా? వద్దా అనేది జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని జీఎస్టీ కిందకు తెస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారని మంత్రి తెలిపారు.

సోమవారం ఆయన గుజరాత్‌లోని గాంధీనగర్‌లో విలేకర్లు పెట్రో ధరల పెంపుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ దేశంలో పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు పైకి పోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో  ముడి చమురు ధర బ్యారల్‌కు ధర 70 డాలర్లుగా ఉండటమే. మన అవసరాల్లో 80శాతం దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడుతోంది’’ అని మంత్రి వివరించారు.

మరోవైపు, వడోదరలో ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రిఫైనరీ విస్తరణపై గుజరాత్‌ ప్రభుత్వం, ఐఓసీ సంస్థ సోమవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఇరువురు అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పెట్రో ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యగా ఇంధనాన్ని జీఎస్టీలో చేర్చాలన్న అంశంపై ఆయన వైఖరేంటని.. ఈ ఆలోచనను తాను కూడా అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఇంధనం ధరలను ప్రపంచ మార్కెట్‌ నియంత్రిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ రంగానికి ఇంఛార్జిగా ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న అభిప్రాయం తనకు ఉన్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులంతా ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే అది జరుగుతుందన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ సమష్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని