The Lancet: దేశంలో పెరుగుతోన్న షుగర్‌.. బీపీ బాధితులు!

దేశంలో (India) 11 శాతానికిపైగా డయాబెటిస్‌ (diabetes), 35 శాతానికిపైగా జనాభా రక్తపోటు (blood pressure) బాధితులుగా మారిపోయారని ది లాన్సెట్‌ నివేదికలో వెల్లడైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లక్షకుపైగా ప్రజలపై పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. 

Updated : 09 Jun 2023 15:54 IST

ది లాన్సెట్‌ నివేదికలో వెల్లడి 

దిల్లీ: దేశంలో (India) మధుమేహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది.. దీని బారిన పడినట్లు ది లాన్సెట్‌  (The Lancet) డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైనాలాజీ జర్నల్‌ నివేదికలో వెల్లడైంది. అలాగే.. 35.5 శాతం ప్రజలు అధిక రక్తపోటు (Hypertension)తో బాధపడుతున్నట్లు తేలింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్(ICMR)తో కలిసి మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఈ అధ్యయనం చేసింది. 2008 - 2020 మధ్య దేశవ్యాప్తంగా 1.1లక్షల మందిపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లో జనాభా, భౌగోళిక పరిస్థితులు, సామాజిక.. ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని దశలవారీగా పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ నివేదికలో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ప్రి-డయాబెటిస్‌ స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయం(Obesity), 39.5శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 81.2 శాతం ప్రజల్లో డిస్‌లిపిడేమియా (లిపిడ్స్‌లో అసమతుల్యత) ఉందని.. ఇది ఆందోళనకర విషయమని పరిశోధకులు తెలిపారు.

‘‘దేశంలో మధుమేహం.. ఇతర సంక్రమించని వ్యాధుల (NCDs) బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో పెరుగుతోంది. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకరస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు తగిన ఆరోగ్య విధానాలు అమల్లోకి తీసుకురావాలి’’అని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని