చెవిలో మైక్రో బ్లూటూత్‌.. సర్జరీ చేయించుకొని మరీ పరీక్షలో కాపీ!

11 ఏళ్లుగా ఆ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఎన్నిసార్లు రాసినప్పటికీ​ ఫైనల్ పరీక్ష మాత్రం పాస్‌ కావడం లేదు. ఇదే ఆఖరి అవకాశం........

Published : 24 Feb 2022 01:41 IST

భోపాల్‌: 11 ఏళ్లుగా ఆ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఎన్నిసార్లు రాసినప్పటికీ​ ఫైనల్ పరీక్ష మాత్రం గట్టెక్కడం లేదు. ఇదే ఆఖరి అవకాశం. అందుకే ఈసారి ఎలాగైనా గట్టెక్కాలని భారీ స్కెచ్ వేశాడా విద్యార్థి. సర్జరీ చేయించుకుని మరీ చెవిలో బ్లూటూత్ పరికరం పెట్టించుకున్నాడు. కాపీ కొట్టేందుకు యత్నిస్తూ అడ్డంగా బుక్కయిపోయాడు. మధ్యప్రదేశ్​ భోపాల్​లోని మహాత్మా గాంధీ కళాశాలలో సోమవారం జరిగిందీ ఘటన.

పరీక్ష ప్రారంభమైన కాసేపటికే దేవి అహల్యాబాయి విశ్వవిద్యాలయం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌ వచ్చింది. ఆ బృందంలో ఒకరైన డాక్టర్ వివేక్ సాఠే.. సదరు విద్యార్థిపై అనుమానం కలిగి తనిఖీ చేశారు. అతడి ప్యాంటు జేబులో మొబైల్ ఉందని గుర్తించారు. అది ఓ బ్లూటూత్ పరికరానికి కనెక్ట్ అయినట్లు చూపించింది. కానీ ఎంత వెతికినా అతడి వద్ద ఎలాంటి బ్లూటూత్ డివైజ్ కనిపించలేదు.

ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పదేపదే ప్రశ్నిస్తే కానీ అసలు విషయం బయటపెట్టలేదు ఆ విద్యార్థి. ఈఎన్​టీ సర్జన్​తో శస్త్రచికిత్స చేయించుకుని చెవిలో మైక్రో బ్లూటూత్ పరికరం అమర్చుకున్నట్లు వెల్లడించడంతో వారంతా అవాక్కయ్యారు. ఎవరూ గుర్తించకుండా ఉండేలా.. ఆ డివైజ్​ చర్మం రంగులోనే ఉండేట్లు జాగ్రత్త పడినట్లు వివరించాడు. ఈ అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

ఇదే తరహాలో మరో విద్యార్థి..

అదే కళాశాలలో మరో విద్యార్థి సైతం ఇదే తరహా హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. సిమ్​తో పనిచేసే ఓ పరికరం, మైక్రో బ్లూటూత్ పరికరాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు గుర్తించారు. అయితే, తాను ఏ సర్జరీ చేయించుకోలేదని, పిన్​ సాయంతో తీస్తే బయటకు వచ్చేస్తుందని ఆ విద్యార్థి చెప్పాడు. ఈ హైటెక్ కాపీయింగ్ ఎత్తుగడలకు ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు కంగుతిన్నారు. ఇద్దరి దగ్గరా ఉన్న బ్లూటూత్ పరికరాలను పరిశీలించాలని ఇంటర్నల్ ఎగ్జామినేషన్​ కమిటీకి సూచించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆ ఇద్దరిపై పోలీసు కేసు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని