Viral news: అమరవీరుల కుటుంబాలనూ వదలరా..?

అమర జవాన్‌ భార్యపై ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన కామెంట్లు చేయడంతో మహిళా కమిషన్‌ సీరియస్ అయ్యింది. 

Updated : 09 Jul 2024 13:39 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సోషల్‌ మీడియాలో ఎవరు ఏ పోస్ట్‌ చేసినా కొందరు నెటిజన్లు వారిపై అసభ్యకరమైన ట్రోల్స్‌ చేస్తూ వారిని మానసికంగా హింసిస్తున్నారు. అవి తట్టుకోలేని ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. కాగా ఈ భూతం అమరవీరుల కుటుంబాలను కూడా వదలకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

దేశం కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికుడు అంశుమన్‌ సింగ్‌ (Captain Anshuman Singh) త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం కీర్తి చక్ర(Kirti Chakra) అవార్డును ప్రకటించింది. ఇటీవల అతడి భార్య స్మృతి రాష్ట్రపతి చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో యావత్‌ భారత దేశం అమరవీరుడి కుటుంబాన్ని కీర్తించింది. అవార్డు స్వీకరించే సమయంలో అమర వీరుడి భార్య పెట్టుకున్న కన్నీళ్లకు దేశప్రజల కళ్లూ చెమర్చాయి. కాగా ఆ వీడియోపైనా కొందరు అసభ్యకర కామెంట్లు పెట్టడంతో దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమరవీరుడి భార్య గురించి తప్పుగా మాట్లాడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దిల్లీకి చెందిన అహ్మద్ అనే వ్యక్తి అసభ్యకరంగా చేసిన కామెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు జాతీయ మహిళా కమిషన్ (NCW)ను కోరారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్‌ ఆ యువకుడి చర్యను తీవ్రంగా ఖండించింది. దిల్లీ పోలీసులు తక్షణమే అతడిని అరెస్టు చేయాలని, ఈ ఘటనపై 3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

26వ బెటాలియన్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన కెప్టెన్‌ అంశుమన్‌ సింగ్‌ గతేడాది జులై 19న విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్‌లో వారు ఉంటున్న బేస్‌ క్యాంప్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో చిక్కుకొన్న జవాన్లను కెప్టెన్‌ ధైర్యంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు. అగ్నికీలలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర గాయాలపాలై మరణించారు. ఆయన శౌర్యానికి గుర్తుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర అవార్డు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని