Kerala: కేరళలో వింత ప్రేమకథ

కేరళలోని పాలక్కడ్‌ జిల్లా నెమ్మర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వింత ప్రేమకథ వెలుగు చూసింది.

Updated : 10 Jun 2021 11:19 IST

పదేళ్లుగా ఒకే గదిలో యువతి నివాసం

పాలక్కడ్‌: కేరళలోని పాలక్కడ్‌ జిల్లా నెమ్మర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వింత ప్రేమకథ వెలుగు చూసింది. 2010 ఫిబ్రవరిలో ఓ టీనేజీ అమ్మాయి (18) ఇంటి నుంచి పారిపోయింది. అయిరూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత పదేళ్లుగా ఆమె ఎక్కడుందో ఇంట్లోవాళ్లకు తెలియలేదు. పదేళ్ల తర్వాత బయటపడ్డ విచిత్రం ఏమిటంటే.. పుట్టింటికి సమీపంలో ఉన్న ఓ అబ్బాయి ఇంటి దగ్గరే ఆమె ఉంటోంది. ఇందులో మరో విశేషం చెప్పాలంటే.. ఆమె అక్కడున్న విషయం అబ్బాయి ఇంట్లోవాళ్లకు కూడా తెలియదట.

గత పదేళ్లుగా తాళం వేసి ఉన్న ఓ గదిలో ఆమె నివసిస్తోంది. ఆమె ప్రేమికుడిగా చెబుతున్న యువకుడే యోగక్షేమాలు చూసుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆ గదికి అటాచ్డ్‌ బాత్‌రూం కూడా లేదు. గదికి ఉన్న ఓ కిటికీ ద్వారా రాత్రిపూట ఆమె బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకునేది. పగటిపూట ఆ కిటికీ కూడా మూసి ఉండేది. ఆమెకు ఆహారం, ఇతర సదుపాయాలు అన్నీ అతడే సమకూర్చేవాడు. తర్వాత బయటి నుంచి తాళం వేసేవాడు. పదేళ్లు ఇలాగే గడిచాయి. మూడు నెలల కిందట.. ఆ యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదేళ్లుగా జరుగుతున్న తతంగంతోపాటు అద్యశ్యమైనది ఒకరు కాదు.. ప్రేమికులిద్దరూ అని పోలీసుల విచారణలో బయటపడింది. నెమ్మర సమీపంలోని కుగ్రామం విథాన్‌స్సెరీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఆ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. తాము కలిసి జీవించాలని అనుకొంటున్నట్టు యువతి కోర్టుకు తెలపడంతో ప్రేమికుడితో వెళ్లేందుకు ఆమెను అనుమతించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని